Oct 27,2023 10:51

వాషింగ్టన్‌ : భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ఒప్పందంపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులకు ఈ ఒప్పందం కూడా కారణం అయ్యి ఉండొచ్చని పేర్కొన్నారు. గురువారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హమాస్‌ దాడుల వెనక భారత్‌ మిడిల్‌ ఈస్ట్‌ యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రకటన కూడా ఒక కారణం అయ్యివుండొచ్చున్నారు. దీనికి సంబంధించిన రుజువులేవీ తమ దగ్గర లేవని, అయితే అది కూడా కారణమని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్‌ కోసం, ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన పురోగతి అయినందున.. ఎట్టి పరిస్థితుల్లో ఆ కారిడార్‌ విషయంలో వెనక్కి తగ్గమని బైడెన్‌ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జి-20 సదస్సు సందర్భంగా.. భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరోపియన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ కోసం ఎంఒయు జరిగింది. భారత్‌తో పాటు అమెరికా, యుఎఇ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, యూరోపియన్‌ యూనియన్‌లు నాటి ఎంఒయుపై సంతకాలు చేశాయి. ఆసియా, పశ్చిమాసియా, మిడిల్‌ ఈస్ట్‌, యూరప్‌ మధ్య ఆర్థిక మెరుగైన అనుసంధానం కోసం.. ముఖ్యంగా ఆర్థిక ఏకీకరణ ద్వారా కారిడార్‌ ఆర్థిక అభివృద్ధి కోసం ఆయా దేశాలు ఈ ఎంఒయు కుదర్చుకున్నాయి.