లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెస్స్ ఇలా ఆమోదం పొందిందో లేదో అలా తొలి కేసు నమోదైంది. ఓ మహిళను మతం మారాలని ఒత్తిడి తీసుకువస్తున్న ఓ వ్యక్తిపై దేవరనియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 24న యోగి సర్కార్ నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ ఆర్డినెస్స్‌కు ఆమోదం తెలిపిన సంగతి విదితమే. శనివారం రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆమోదం తెలుపడంతో...రాష్ట్రంలో చట్టం అమల్లోకి వచ్చింది. మతం మారాలంటూ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై ఈ చట్టం కింద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఆ వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ ఆర్డినెస్స్ ప్రకారం నిందితుడిని పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. పెళ్లి కోసం మతం మారాలంటూ నిర్బంధించేవారికి ఏడాది నుండి ఐదేళ్ల జైలు, రూ. 15 వేల జరిమానా విధించవచ్చు. మైనర్లను, ఎస్‌సి, ఎస్‌టి, మహిళల ఇష్టం లేకుండా మత మార్పిడికి ఒత్తిడి తెస్తే 3 ఏ ళ్ల నుండి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.










