Jan 08,2021 07:38

వివాహానంతరం మత మార్పిడిని నేరంగా పరిగణించేలా బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాల రాజ్యాంగబద్ధతను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం ఆహ్వానించదగింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాల రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ 'సిటిజన్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌' అనే స్వచ్ఛంద సంస్థ, న్యాయవాది విశాల్‌ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు వెంటనే స్టే ఇవ్వకపోయినా విచారణకు స్వీకరించడం వల్ల వాటికి రాజ్యాంగబద్ధత లేదని తేలడంతోపాటు ఆయా ప్రభుత్వాల మతోన్మాద పోకడలను ఎండగట్టడానికి కూడా దోహదపడుతుందని ఆశించవచ్చు. ఈ చట్టాల్లోని కొన్ని నిబంధనలు దౌర్జన్యపూరితమైనవనీ, ప్రభుత్వం అనుమతితోనే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనడం విచారకరమన్న పిటిషనర్ల వాదన ఎంతో సబబైనది. ఆ చట్టాల్లోని అనేక నిబంధనలు భారత రాజ్యాంగం దేశ పౌరులకు ప్రసాదించిన లౌకికవాదం, సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 పేర్కొన్న ప్రాథమిక హక్కులైన వ్యక్తి స్వేచ్ఛ (లిబర్టీ), గౌరవాలకు (డిగ్నిటీ) ఈ చట్ట నిబంధనలు భంగం కలిగిస్తున్నాయి.
పెళ్లి తర్వాత మతం మారాలనుకునేవారు రెండు నెలలు ముందుగాను, సదరు మార్పిడి ప్రక్రియ నిర్వహించేవారు ఒక నెల ముందు జిల్లా మెజిస్ట్రేట్‌ (కలెక్టర్‌)కు సమాచారం అందజేయడమేగాక ఎవరి బలవంతం లేకుండా మతం మార్చుకున్నారని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా వారిపైనే మోపడం దారుణం. ఆ చట్టాలను ఉల్లంఘించి మత మార్పిడి జరిగినట్టు రుజువైతే సదరు వ్యక్తికి ఆరు నెలల నుండి మూడేళ్ల వరకు జైలు, ఆ ప్రక్రియ నిర్వహించినవారికి ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తారట! కఠినమైన శిక్షలతో ప్రజలను ముఖ్యంగా మైనారిటీ మతస్తులను భయభ్రాంతులను చేయాలన్న ఆయా ప్రభుత్వాల దుష్ట చింతన స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ చట్టాల కింద ఆయా రాష్ట్రాల పోలీసులు పలువురిని అరెస్టు చేశారు కూడా. దుర్మార్గమైన ఈ తరహా చట్టాలను మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలూ తీసుకొచ్చాయి. ఇంకొన్ని 'కాషాయ' ప్రభుత్వాలు అందుకు బరి తెగించవచ్చు కూడా!
వివాహం, మత విశ్వాసం వంటివి పూర్తిగా వ్యక్తిగతమైనవి. ఆయా వ్యక్తులు తమకు నచ్చిన మత విశ్వాసాలను ఆచరిస్తారు. నచ్చకపోతే వాటిని విడనాడి మరో మతానికి మారుతారు. మేజర్లయితే తాము ఇష్టపడినవారిని వివాహం చేసుకుంటారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఇవీ భాగమే. 'దుస్తులు, ఆహారం, ఆలోచనలు, సైద్ధాంతిక భావాలు, ప్రేమ, జీవిత భాగస్వామ్యం వంటి అంశాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి. భాగస్వామిగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్నది కానీ పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి గానీ ప్రభుత్వం లేదా చట్టం ఏ ఒక్కరినీ నియంత్రించ జాలవు' అని సర్వోన్నత న్యాయస్థానం హదియా కేసులో విస్పష్టంగా తీర్పునిచ్చింది. 'తన జీవితానికి సంబంధించిన ప్రధాన విషయాల్లో నిర్ణయించుకోవడం ఆ వ్యక్తి స్వయంప్రతిపత్తికి సంబంధించిన అంశం. ప్రేమ, పెళ్లికి సంబంధించి ఒక (మేజర్‌) వ్యక్తి హక్కు విషయంలో ప్రభుత్వం లేదా చట్టం జోక్యం చేసుకుంటే సదరు వ్యక్తి స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం (చిల్లింగ్‌ ఎఫెక్ట్‌) వుంటుందని పుట్టుస్వామి కేసు తీర్పులో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి ఎన్నో ప్రముఖ తీర్పులున్నా బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు తీసుకురావడం న్యాయవ్యవస్థ పైన, రాజ్యాంగం పట్ల వారికి ఏమాత్రం గౌరవం లేదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. భారత రాజ్యాంగాన్ని, కోర్టు తీర్పులను కాదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన 'మత మార్పిడి' చట్టాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేస్తుందని సెక్యులర్‌ వాదులు, ప్రగతి కాముకులు ఆశిస్తున్నారు. లేకపోతే భారత దేశ మౌలిక లక్షణాల్లో ఒకటైన సెక్యులరిజం మరింత ప్రమాదంలో పడుతుంది. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వేచ్ఛకు ముప్పు కలుగుతుంది. పౌరులారా బహుపరాక్‌!