పన్నెండు వారాలుగా ఆరుబయట రోడ్లపైన గుడారాలు వేసుకుని రైతులు పోరాటం సాగిస్తుంటే దీనిపై ఇంతకాలం మూగనోము పాటించిన ప్రధాని నరేంద్రమోడీ ఎట్టకేలకు పెదవి విప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ ముగింపులో ప్రధాని మాట్లాడుతూ రైతుల ఆందోళన గురించి మొదటిసారి ప్రస్తావించారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్ గురించి కాకుండా, రైతు ఉద్యమంపై దాడికి ఈ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోవడం చాలా శోచనీయం. పార్లమెంటును వేదికగా చేసుకుని అడ్డగోలుగా వాదించడం, బుకాయింపులకు దిగడం వంటి చర్యలు ప్రధాని ప్రతిష్టను దిగజార్చేందుకు తప్ప మరి దేనికీ ఉపయోగపడవు. స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రైతాంగ పోరాటానికి అంతర్జాతీయంగా సంఘీభావం వెల్లివిరుస్తుంటే, ప్రధాని మోడీ మాత్రం ఈ చట్టాలను సమర్థించుకునేందుకు యత్నించడం దేశాన్ని మొత్తంగా వంచించడమే అవుతుంది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించేందుకు తాజాగా తీసుకొచ్చిన సంస్కరణలను 1960లలో చేపట్టిన హరిత విప్లవంతో పోల్చి చూపడం మోడీ మోసకారితనానికి పరాకాష్ట. ఆ రోజు వ్యవసాయ సంస్కరణలు తెచ్చినప్పుడు ఎటువంటి వ్యతిరేకత ఎదురైందో ఇప్పుడు అదే వ్యతిరేకత తనకు ఎదురైందని చెప్పడం పూర్తిగా అసంబద్ధం. హరిత విప్లవానికి, మోడీ తీసుకొచ్చిన సంస్కరణలకు ఎక్కడా పొంతనే లేదు. సరికదా హరిత విప్లవపు ఫలితాలను పూర్తిగా తారుమారు చేయబూనుకున్న చట్టాలు ఇవి. కొన్ని పరిమితులున్నప్పటికీ బెంగాల్ క్షామం వంటి తీవ్ర కరువు కాటకాలు పునరావృతం కాకుండా చూడడంలోను, ఆహార అభద్రత నుంచి దేశాన్ని కాపాడడంలోను హరిత విప్లవం దోహదపడింది. నేటి మోడీ చట్టాలు రైతులను భూముల నుంచి దూరం చేసి, దేశాన్ని ఆహార సంక్షోభం వైపు నెట్టేవిగా ఉన్నాయి. ఈ చట్టాలే గనుక పూర్తిగా అమలైతే మన దేశం అన్నమో రామచంద్రా అంటూ అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల చుట్టూ భిక్షాపాత్ర పట్టుకుని తిరగవలసిన దుస్థితి వస్తుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైన పరపతి, ఆహార ధాన్యాల సేకరణ, మార్కెటింగ్‌లో ప్రభుత్వ జోక్యం పెరగాలని హరిత విప్లవం చెబుతుంటే, మోడీ సంస్కరణలు వ్యవసాయ రంగంలో ప్రభుత్వ జోక్యం ఉండరాదంటున్నాయి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర, మార్క్ ఫెడ్‌లు, విత్తనాలు, ఎరువులపై సబ్సిడీల ఆవశ్యకత గురించి హరిత విప్లవం పేర్కొంటే, మోడీ చట్టాలు వీటన్నిటికీ మంగళం పాడుతున్నాయి. నాటి హరిత విప్లవం వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటే, నేటి మోడీ విధానాలు వ్యవసాయ ఉత్పాదకతను దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హరిత విప్లవం దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపిస్తే, మోడీ తీసుకొచ్చిన ఈ మూడు నల్ల చట్టాలు దేశాన్ని ఆధోగతి పాల్జేసేలా ఉన్నాయి. ఈ రెండిటి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటే, రెండూ ఒకటేనని ప్రధాని నమ్మబలకడం ఎవరిని వంచించడానికి? వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం లేదా అంటే ఉంది. కానీ, ఈ తరహా సంస్కరణలు కాదు. భూ కేంద్రీకరణను బద్దలు చేసి, భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు తీసుకు రావాల్సిన అవసరముంది. సాగు చేసేవాడికే భూమిపై హక్కు కల్పించేందుకు, విత్తన, ఎరువులు, మార్కెటింగ్ రంగాల్లో ప్రభుత్వ పాత్ర పెరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత తరగతికి చెందిన వారు భూ యజమానులుగాను, అణగారిన వర్గాలు వ్యవసాయ కూలీలుగాను కొనసాగే ప్రస్తుత పరిస్థితి స్థానే దున్నేవానికే భూమి దక్కేలా చట్టాలను తీసుకురావాలి. కానీ, మోడీ ప్రభుత్వం అటు గ్రామీణ ధనిక రైతులను, ఇటు వ్యవసాయ కూలీలను ఇద్దరినీ తొలగించి గుత్త పెట్టుబడిదారులను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టేందుకు పూనుకుంది. ఈ ముదనష్టపు విధానాలకు వ్యతిరేకంగా రైతులు తెగించి పోరాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా, ఈ ఉద్యమం వెనక కొత్త రకం విదేశం విధ్వంసక భావజాలం (ఫారిన్ డిస్ట్రక్షన్ ఐడియాలజీ- ఎఫ్‌డిఐ) ఉందంటూ విద్వేషం వెళ్లగక్కడం, కొత్తగా పుట్టుకొచ్చిన 'ఆందోళన జీవి' జాతికి చెందినవారు ఉన్నారని నిందలు వేయడం ఈ 'కార్పొరేట్ జీవి' కే చెల్లింది. రైతుల పోరాటంపై దేశవ్యాపితంగానే గాక, అంతర్జాతీయంగా కూడా వెల్లువెత్తుతున్న మద్దతును చూసి జీర్ణించుకోలేని ఈ నయవంచక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలి.










