
న్యూఢిల్లీ : దేశంలోని 80 కోట్ల మంది పేదలకు మరో ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రకటించారు. ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ అంటూ గొప్పలు పోయారు. భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేస్తానని మోడీ మరో గ్యారంటీ ఇచ్చారు. అయితే ఇక్కడ మోడీ ఓ విషయాన్ని దాస్తున్నారు. అదేమంటే దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తూ, 2028 నాటికి మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన పక్షంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఏముందన్నది మాత్రం ఆయన చెప్పడం లేదు. దేశం అత్యంత వేగంగా అభవృద్ధి చెందుతూ అమృతకాలంలో ప్రవేశిస్తుంటే మరో ఐదు సంవత్సరాల పాటు ఉచిత రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నదే ఇక్కడ ప్రశ్న. 2023వ సంవత్సరపు ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం నాలుగు స్థానాలు దిగజారి మొత్తం 125 దేశాల్లో 111వ స్థానంలో నిలిచింది. ఈ సూచికను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే మరో విధంగా దానిని అంగీకరించింది. అందుకే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ యోజన పథకం కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది.
డాంబికాల ప్రచారం
శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోడీ హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానిగా మోడీ పాలన సుమారు పది సంవత్సరాల పాటు కొనసాగింది. అభివృద్ధి, ఉపాధి, పొదుపు రేటు, ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు వంటి విషయాలలో మంచి ఫలితాలు రాబట్టడానికి ఈ పది సంవత్సరాల సమయం చాలా ఎక్కువే. అయితే ఈ అంశాల్లో వాస్తవ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వ పనితీరు పేలవంగా ఉంది. అయినప్పటికీ మోడీ, ఆయన అనుచర గణం మాత్రం మీడియాలోనూ, ఇతర సామాజిక మాధ్యమాలలోనూ దేశం ఆశ్చర్యకరమైన పురోభివృద్ధి సాధించిందని డాంబికాలు పలుకుతున్నారు. గడచిన పది సంవత్సరాల్లో మోడీ అధిక జీడీపీ వృద్ధి రేటుకు గ్యారంటీ ఇవ్వలేదు. గత తొమ్మిదేళ్లుగా ఈ రేటు 5.7%గానే ఉంటోంది. 2014లో హామీ ఇచ్చిన విధంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో మోడీ దారుణంగా విఫలమయ్యారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ వైఫల్యమే. గత పదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులకు అయ్యే వ్యయాన్ని కనీస మద్దతు ధరల పెంపుతో పోలిస్తే ఈ విషయం బోధపడుతుంది. ఈ హామీలను నెరవేర్చలేని మోడీ ఇప్పుడు మరో ఐదేళ్ల వరకూ ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తానని గ్యారంటీ ఇస్తున్నారు.
కార్మిక సర్వే చెప్పిన చేదు నిజాలు
ఆర్థిక రంగంలో మోడీ ప్రభుత్వ పనితీరు ఎంత దారుణంగా ఉన్నదో గణాంకాల శాఖ గత నెలలో విడుదల చేసిన కార్మిక సర్వే బయటపెట్టింది. 2022-23 జూలై నెలల మధ్య కాలానికి సంబంధించి ఈ సర్వే ఏం చెప్పిందంటే దేశంలో ఉద్యోగాలు, ఉపాధి పొందిన 500 మిలియన్ల మందిలో 58శాతం మంది స్వయం ఉపాధి పొందిన వారే. స్వయం ఉపాధి పొందిన వారిలో ఎక్కువ మంది చిన్న చిన్న వ్యాపారులు, స్వయంగా సేవలు అందించే వారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. 2017-18లో ఉద్యోగాలు, ఉపాధి పొందిన వారిలో వీరి సంఖ్య కేవలం 52శాతం.