
న్యూఢిల్లీ : సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిపై జరిపిన వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ దాడి ఐడిఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) చేసిందని హమాస్ ఆరోపించింది. అయితే ఈ దాడి ఐడిఎఫ్ పాల్పడలేదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'అల్ అహ్లీ ఆసుపత్రిలో జరిగిన ప్రాణ నష్టానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తాను. ఈ ఘర్షణల్లో పౌరుల మరణాలు ఆందోళన కలిగిస్తుంది. ఈ దాడికి ప్రమేయం ఉన్నవారు బాధ్యత వహించాలి.' అని మోడీ తన ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాగా, ఈ ఘటనలో మృతి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సంతాపం తెలిపారు. అలాగే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఆసుపత్రిపై దాడిని ఖండించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఐడిఎఫ్ కానీ, పాలస్తీనా హమాస్ కానీ ఎవరైనా సరే పౌరులపై జరిపి ఈ దాడిని సమర్థించలేమని మాక్రాన్ అన్నారు.