
న్యూఢిల్లీ : శనివారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించిన ఆదిత్య ఎల్ - 1 ప్రయోగం విజయవంతమైనదని ఇస్రో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 'చంద్రయాన్ -3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 విజయవంతంగా ప్రారంభించినందుకు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై మంచి అవగాహన పెంపొందించడానికి అవిశ్రాంతంగా శాస్త్రీయ ప్రయత్నాలు కొనసాగుతాయి.' అని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇస్రో శాస్త్రవేత్తలని అభినందించారు. ఈ సందర్భంగా 'భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఆదిత్య-ఎల్1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం, ఖగోళ దగ్విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఎంతగానో సాయపడుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను నేను అభినందిస్తున్నాను. మిషన్ విజయవంతం అయినందుకు నా శుభాకాంక్షలు' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
కెసిఆర్
ఆదిత్య ఎల్ -1 విజయవంతమైనందుకు తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. పరిశోధనా రంగంలో ఇస్రో మరో కీలక మైలురాయిని దాటింది అని కెసిఆర్ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
జగన్మోమన్‌రెడ్డి
ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లారంటూ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారాయన.