ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా):భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రయోగ విజయాలతో రెట్టింపు ఉత్సాహంతో చేపట్టిన సరికొత్త ప్రయోగంలో రాకెట్ తొలుత మొరాయించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే లోపాన్ని సరిచేసి విజయవంతంగా ప్రయోగించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 8.45 గంటలకు ప్రయోగించాలనుకున్న టివి డి1 రాకెట్ పైకి లేవకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు షార్ అధికార వర్గాలు తొలుత ప్రకటించాయి. ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్‌లోని ఆన్ బోర్డ్ కంప్యూటర్ ప్రయోగాన్ని ఆపేశారు. కౌన్‌డౌన్ పూర్తయినప్పటికీ సాంకేతిక లోపం వల్ల అనుకున్న సమయానికి రాకెట్ ప్రయోగం చేయలేకపోయారు. ఈ లోపాన్ని సరిచేసి గంటా 15 నిమిషాలు లేటుగా మళ్లీ ప్రయోగించారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికపై నుండి ఉదయం పది గంటలకు ప్రయోగాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో మానవ సహిత రాకెట్ ప్రయోగాల కోసం జరిపే పరిశోధనల్లో భాగంగా మానవ రహిత కృమాడ్యులును ప్రయోగించారు. 4,520 కిలోల బరువున్న ఈ మాడ్యూల్ 17 కిలోమీటర్లు ఎత్తు వరకు వెళ్లి అక్కడ నుండి ప్యారాచూట్ల సహాయంతో శ్రీహరికోటకు సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్రంలో పడిపోయింది. నేవీ సహాయంతో తిరిగి ఈ మాడ్యూల్‌ను వెనక్కు తీసుకురావడంతో ప్రయోగం విజయవంతమైనట్లు షార్ అధికారులు ప్రకటించారు. భవిష్యత్‌లో ఇలాంటి మాడ్యూళ్లలో మనుషులను పెట్టి పైకిపంపనున్నారు. అవి తిరిగి సురక్షితంగా భూమి మీదకు చేరుకునేలా పరీక్షల నిమిత్తం ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించింది. ఇలాంటి ప్రయోగాలు విజయవంతమైతే అంతరిక్ష పర్యటనలు సులభతరం కానున్నాయి.
తొలుత స్వల్ప అంతరాయం