బెంగళూరు : మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ మిషన్‌కు సంబంధించి మానవ రహిత విమాన పరీక్షలను ప్రారంభించనుంది. ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరు గురించి సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర సందర్భాల్లో వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ వ్యవస్థను త్వరలో పరీక్షించనుంది. ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 పేరిట ఈ పరీక్షను ఇస్రో నిర్వహిస్తోంది. ఇందుకోసం ఓ ప్రయోగాత్మక క్రూ మాడ్యుల్‌తో పాటూ క్రూ ఎస్కేప్ వ్యవస్థను రూపొందించింది. ఈ క్రమంలో రాకెట్ నుంచి విడివడే క్రూ మాడ్యుల్ పారాషఉట్ల సాయంతో బంగాళాఖాతంలో దిగుతుంది. ఈ సందర్భంగా వ్యోమగాముల రక్షణకు ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును మాడ్యూల్‌లోని వివిధ పరికరాలతో శాస్త్రవేత్తలు సేకరిస్తారు. క్రూ మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకున్నాక అందులోని డాటా ఆధారంగా మరిన్ని మెరుగులు దిద్దుతారు. త్వరలో ఫ్లైట్ టెస్ట్ అబార్ట్ మిషన్ చేపడతామని ఇస్రో తాజాగా వెల్లడించింది. టెస్ట్ వెహికల్ అనేది ఈ అబార్ట్ మిషన్ కోసం అభివద్ధి చేయబడిన ఒకే-దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్‌లు క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయి. మానవ రహిత ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనున్నారు. గగన్‌యాన్ మిషన్ సమయంలో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ 17 కి.మీ ఎత్తులో విడిపోతుంది. బంగాళాఖాతంలో తాకిన తర్వాత క్రూ మాడ్యూల్‌ను భారత నావికాదళానికి చెందిన ప్రత్యేక నౌక, డైవింగ్ బందాన్ని ఉపయోగించి తిరిగి పొందుతామని ఇస్రో తెలిపింది. ఈ విమాన పరీక్ష గగన్‌యాన్ మిషన్‌కు కీలకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అవి ప్రాజెక్ట్ ముఖ్య భద్రతా లక్షణం. ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ ప్రాజెక్ట్ ఇద్దరు ముగ్గురు సభ్యులతో కూడిన సిబ్బందిని ఒకటి నుంచి మూడు రోజుల మిషన్ కోసం భూమి చుట్టూ 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్లి వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.