Aug 02,2023 17:48

న్యూఢిల్లీ : గాంధీనగర్‌లో మహిళా సాధికారతపై కొనసాగుతున్న జి20 మంత్రుల సదస్సులో మూడవ రోజు బుధవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఆయన ఈరోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. మహిళా సాధికారత అనే అంశంపై ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. 'మహిళలు అభివృద్ధి చెందినప్పుడు.. ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. వారి ఆర్థిక సాధికారత వృద్ధికి ఆజ్యం పోస్తుంది. వారి విద్య వల్ల ప్రపంచం పురోగమిస్తుంది. వారి నాయకత్వం సమగ్రతను పెంపొందిస్తుంది. వారి స్వరాలు సానుకూల మార్పును ప్రేరేపిస్తాయి. మహిళా సాధికారతకు అత్యంత ప్రభావవంతమైన మార్గం మహిళల నేతృత్వంలోని అభివృద్ధి విధానం' అని మోడీ అన్నారు. మహిళా సాధికారతకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ అని మోడీ అన్నారు. 'ద్రౌపది ముర్ము గిరిజన నేపథ్యం నుండి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తోంది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద రక్షణ దళానికి కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా పనిచేస్తున్నారు' అని మోడీ అన్నారు.
'ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఆర్థిక, పర్యావరణ, సామాజిక మార్పులకు కీలక ఏజెంట్లుగా ఉన్నారు. 1.4 మిలియన్ల భారతదేశంలోని గ్రామీణ స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రతినిధులలో 46 శాతం మంది మహిళలే' అని ఈ సందర్బంగా మోడీ అన్నారు. అలాగే దేశంలో స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడే మహిళల సంఖ్య పెరుగుతుండడం శక్తివంతమైన మార్పుకు నిదర్శనం అని ప్రధాని అన్నారు. 'కోవిడ్‌ మహమ్మారి సమయంలో స్వయం సహాయక బృందాలు, ఎన్నుకోబడిన మహిళా ప్రతినిధులు మనకు మద్దతుగా నిలిచారు. వారు మాస్క్‌లు, శానిటైజర్‌లను తయారుచేయడంతోపాటు, మహమ్మారి వ్యాప్తిపై అవగాహన పెంచారు. దేశంలో 80 శాతానికి పైగా నర్సులు, మంత్రసానులు మహిళలే ఉన్నారు. మహమ్మారి సమయంలో వారే రక్షణరేఖగా నిలిచారు. వారి విజయాలను చూసి మేము గర్విస్తున్నాం' అని అన్నారు. మహిళలు చిన్న వ్యాపారాలను నిర్వహించడానికి ప్రభుత్వం మూలధనాన్ని ఎలా కల్పిస్తుందో కూడా మోడీ ఈ సందర్భంగా చెప్పారు. గాంధీనగర్‌లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జి20 మంత్రుల సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సు శుక్రవారంతో ముగియనుంది.