గత 40 రోజుల్లో అరవైకి పైగా గ్రామాల్లో రైతులను కలిశాను. వ్యవసాయ పరిస్థితులు, రైతు సమస్యలు, బిజెపి ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల గురించి వారితో చర్చించాను. ఒక్క రైతుకు కూడా వ్యవసాయ చట్టాలు చేశారని తెలియదు. వాటి వలన లాభమో, నష్టమో కూడా తెలియదు. ఆశ్చర్యం కలిగించినప్పటికీ, ఇదే అసలు వాస్తవం. మోడీ రైతులను ఉద్ధరించడానికే వ్యవసాయ చట్టాలు చేశానని, రైతులంతా సంతోషంతో ఆమోదించారని అంటున్నారు. రైతుల పేరుతో దళారులు ఆందోళన చేస్తున్నారని, ప్రతిపక్షాలు రైతులను పక్కదారి పట్టించి రెచ్చగొడుతున్నాయని మోడీ విమర్శలు చేస్తున్నారు.
వాస్తవం ఏమంటే విజయనగరం జిల్లా రైతులకు ఆ చట్టాలు చేసినట్లే తెలియదు. ఇపుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటం టీవీల్లో చూస్తున్న వారికి ప్రభుత్వంతో రైతులకు ఏదో గొడవ జరుగుతున్నదని తెలుస్తున్నది. కానీ రైతులు ఎందుకు అంతగా పోరాడుతున్నారో మాత్రం తెలియదు. ఇందుకు రెండు కారణాలు. మొదటిది టిడిపి, వైసిపి పార్టీలు పార్లమెంటులో చట్టాలను సమర్ధించడం వలన మౌనం వహించాయి. అందువలన ఆ పార్టీల శ్రేణులకు కూడా ఏమీ తెలియదు. ఈ రెండు పార్టీల అనుకూల పత్రికలు, టీవీలు కూడా ఈ విషయంలో సైలెంట్ గానే ఉన్నందున చట్టాల్లో ఏమున్నదో రైతులకు ఏమీ తెలియడం లేదు. రైతుకు తెలియకుండా చేసి రైతులు కదలకుండా చేసే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోంది. ప్రజాతంత్ర శక్తులు పూనుకొని రైతులను చైతన్యవంతులను చేయాలి.
ప్రభుత్వ విధానాల వల్లే ప్రధాన నష్టం
ధాన్యం పంటనే తీసుకుని పరిశీలిస్తే రైతుకు నష్టం ఎందుకు వస్తుందో, ఎక్కడ వస్తుందో తెలుస్తుంది. మొదటిది విత్తనం రైతు చేతుల్లో నుండి బహుళజాతి కంపెనీల చేతుల్లోకి పోయింది. రైతు పంటను విత్తనంగా మార్చేసి కనీసం రెండు రెట్లు ధర పెంచేసి... రైతుకు అదే విత్తనం కంపెనీ అమ్ముతున్నది. రైతుపై మొదటి దెబ్బ ఇక్కడ పడ్డది. తరువాత ఎరువుల ధర ప్రతి ఏడు పెరుగుతోంది. కాడి, ఎడ్లు, బండి గతమైపోయి ట్రాక్టరు ప్రస్తుతమయ్యింది. డీజిల్ ధరలు చుక్కలనంటడంతో ట్రాక్టర్ల కిరాయి భారీగా పెరిగింది. పురుగు మందులు తయారు చేస్తున్న బహుళజాతి కంపెనీలు వాటి ధర పెంచిన దెబ్బ మరొకటి.
పంట అమ్ముకున్న దగ్గర రైతు నష్టపోయేది చాలా ఎక్కువ. ఒక కంపెనీ ఉత్పత్తి చేసే సరుకు ధర ఆ సరుకు ఉత్పత్తికి అయ్యే మొత్తం ఖర్చుపై (భూమి, భవనం, యంత్రాలు, ఇంధనం, ముడిసరుకు, కార్మికుల వేతనం మొత్తం వ్యయంపై) యజమాని లాభం కూడా కలిపి నిర్ణయిస్తారు. కానీ రైతు పండించే పంటలకు ఆ లెక్క వేయడం లేదు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర లేదు. కొన్నింటికే కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్నారు. ఆ నిర్ణయించిన ధరకు కూడా ఎటువంటి శాస్త్రీయత లేదు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతు పెట్టిన మొత్తం పెట్టుబడులకు 50 శాతం కుటుంబ సభ్యుల శ్రమను కూడా కలిపి పంట మద్దతు ధర నిర్ణయించాలి. ఆ విధంగా నిర్ణయిస్తే క్వింటాల్ ధాన్యం ధర రూ.2700 దాటి ఉండాలి. కానీ మోడీ ప్రభుత్వం రూ.1850 నిర్ణయించింది. క్వింటాలుకు రూ.850 ప్రభుత్వమే తగ్గించింది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది అనుకుంటే ప్రభుత్వం చేకూర్చిన నష్టం రూ.17,000.
వ్యాపారుల దోపిడీ అదనం
ఈ సంవత్సరమే తీసుకుంటే రాష్ట్రంలో అక్కడక్కడా రైతు సంఘం, కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడిన చోట తప్ప ఎక్కడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యం కొనలేదు. ప్రభుత్వం చెప్పే లెక్కలూ నిజం కాదు. రైతుల వద్ద తక్కువకు కొని ఆ ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్లు నమోదు చేసి ప్రభుత్వం వద్ద మద్దతు ధర కొట్టేస్తున్నారు. జిల్లా జిల్లాకు ఊరూరికి ధరలో మార్పు వుంది. ఒక కిలో రూ.13.50 నుండి రూ.16 మధ్య రైతులు ధాన్యం అమ్మేశారు. సరాసరి క్వింటాలుకు రూ.300 పైనే రైతులు నష్టపోయారు. అనగా ఎకరాకు 20ఐ రూ.300 ొ రూ.6000 నష్టం. ప్రభుత్వం, వ్యాపారి ఇద్దరూ కలిసి ఒక ఎకరాకు రైతుకు చేసిన మొత్తం నష్టం రూ.17000ం రూ.6000 ొ రూ.23,000.
ఎంతోకొంతకు అమ్ముకోక తప్పట్లా
ఎందుకింత తక్కువకు అమ్ముకుంటున్నారని రైతును అడిగితే 'ప్రభుత్వం కొనుగోలు కేంద్రం పెట్టింది. కానీ కొనడం లేదు. ఎలాగో ఒకలా అమ్ముకోకపోతే తెచ్చిన అప్పులవాడు ఊరుకుంటాడా? కల్లంలో ఉంచితే కాపలా కాయాలి. ఇంటి దగ్గర ధాన్యం దాచుకోవడానికి చోటు లేదు. గత సంవత్సరం ఇచ్చిన ధాన్యానికి ప్రభుత్వం ఇంతవరకు చెల్లించనివి కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంతో కొంతకు అమ్ముకోక తప్పడం లేద'ని రైతుల సమాధానం. బిజెపి చేసిన చట్టాలు పూర్తిగా అమలైతే ఈ మాత్రం ధర కూడా లేక రైతులు తీవ్రంగా నష్టపోతారు.
చెరుకు మద్దతు ధర మరీ హీనం
భార్గవ కమిషన్ సిఫార్సు మేరకు చెరుకు టన్నుకు రూ.4000 నిర్ణయించాలి. కానీ మోడీ ప్రభుత్వం రూ.2800 నిర్ణయించింది. టన్నుకు రూ.1200 తక్కువ నిర్ణయించింది. అనగా ఒక ఎకరానికి 40 టన్నులు దిగుబడి వస్తుంది అనుకుంటే ప్రభుత్వమే రూ.48000 రైతుకు నష్టం చేసింది. ఆ పైన కేంద్ర ప్రభుత్వం 8.5 శాతం రికవరీ వద్ద వున్న కనీస మద్దతు ధరను 10 శాతం రికవరీ వద్దకు మార్చివేసింది. కేంద్రం నిర్ణయించిన ధర రైతుకు సరిపోదు గనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక ధర ప్రకటించేది. చంద్రబాబు ప్రభుత్వం దాన్ని రద్దు చేసి తన వంతు ద్రోహం చేసింది. తరువాత అధికారం లోకి వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పునరుద్ధరించలేదు. చెరుకు పండించడం నష్టదాయకంగా మారింది.
రైతు నష్టం కూలీ, వృత్తిదారులకూ నష్టమే
ప్రభుత్వ విధానం మూలంగా రైతులు నష్టపోతున్నారు. పాపం రైతుకు ఈ వాస్తవం తెలియకపోవడంతో కూలి పెరగడమే తమ నష్టానికి కారణంగా భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాలక వర్గ పార్టీలు వారికనుగుణంగా వ్యవహరిస్తున్న ప్రచార సాధనాలు రైతుల నష్టాలకు ప్రభుత్వ విధానాలు కారణం కాదని, కూలి రేట్లు ఎక్కువ ఇవ్వవలసి రావడమే కారణమని నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎప్పుడోకాని కనపడని ప్రభుత్వం కన్నా నిత్యమూ కళ్లెదురుగా వుండే కూలీలే తమ నష్టాలకు కారణమని రైతులు అనుకోవడానికి పాలక వర్గాల ప్రచారం దోహదం చేస్తున్నది.
ఇంకోవైపున అవసరమైనప్పుడు కూలీలు దొరకడం లేదన్న భావన కూడా రైతులలో కనపడింది. వ్యవసాయంలో ట్రాక్టర్లు, యంత్రాల వాడకం పెరిగాక కూలీలకు దొరికే పని దినాలు బాగా తగ్గాయి. అందువలన బతుకుతెరువు కోసం వారు ఇతర పనులను వెతుక్కుని పోతున్నారు. కనుకనే రైతు కోరుకున్న సమయంలో ఒక్కోసారి కూలీలు దొరకడం లేదు. నిజానికి ప్రభుత్వ విధానాల వలన రైతులు, కూలీలు ఇరువురూ నష్టపోతున్నారు. లాభపడుతున్నది దళారీలే. వారికి ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. అందుచేత రైతు నష్టాలకు కారణం ప్రభుత్వ విధానాలేనని వారికి వివరించి ఈ అపోహల నుండి రైతును బయటకు తేవాలి. వ్యవసాయమంటే రైతు, కూలీ, వృత్తిదార్ల ఉమ్మడి శ్రమ. రైతు నష్టం అందరికీ నష్టమే. వ్యవసాయంలో నష్ట ఫలితమే గ్రామాలను విడిచి పట్టణాలకు వలసలు. ఏ రైతూ తన కొడుకు వ్యవసాయంలో ఉండాలనుకోవడం లేదు. ఆ కారణంగానే వ్యవసాయంలో యువకులు లేరు. అందరూ తల నెరిసిన వారే.
మోడీ చట్టాలను రద్దు చేయించాలి
దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లు ఈ దేశంలో వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ను తమ గుప్పెట్లో చిక్కించుకోడానికి పన్నిన వలలో భాగమే మోడీ చేసిన మూడు వ్యవసాయ చట్టాలు. వీరి బారి నుంచి వ్యవసాయాన్ని, ఆహార భద్రతను కాపాడుకోవాలంటే రైతు, కూలి, వృత్తిదారుల ఉమ్మడి పోరాటం అవసరం. ఈ చట్టాల వలన వినియోగదారులూ నష్టపోతారు. అందువలన మొత్తం శ్రమ జీవులందరి విశాల ఐక్య ఉద్యమం కూడా అవసరం.
* ఎం. కృష్ణమూర్తి (వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)










