Oct 23,2023 13:04

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం 9 గంటల విద్యుత్ స్థానంలో ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయడాన్ని నిరసిస్తూ కర్నూల్ జిల్లా ఆదోనిరూరల్ మండలం పరిధిలో గణేకల్లు, పెద్ద తుంబలం సబ్ స్టేషన్ ల ముందు రోడ్డుపైన సిపిఎం, రైతు సంఘం, ఆధ్వర్యంలో రైతులు బయటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే.వెంకటేశులు మాట్లాడుతూ ఒకపక్క వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే, మరోపక్క రెండు గంటలకు కోత పెట్టి వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవుర మైన కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రైతులకు ఇది  మరింత నష్టం చేస్తుందని, ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అనే అయామ్యంలో ఉన్న రైతులకు కరెంటు కోతలు తీవ్రమైన నష్టాలను తెచ్చి పెడుతూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి  9 గంటలు ఏకధాటిగా ఇస్తే మోటర్లు పాడై నష్టాలను తెచ్చి పెడుతుంది. కాబట్టి ఏకధాటిగా కాకుండా విడతల వారీగా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో మరింత పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళన చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షుడు కే.శేఖర్, రైతు సంఘం మండల నాయకులు హనుమంత రెడ్డి, గణేకల్లు, కుప్పగల్లు,  పాండవగల్లు, జాలిమంచి  గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.