Oct 03,2023 13:09

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : వ్యవసాయ రంగంలోని మోటార్లకు స్మార్ట్‌ మీటర్లను వ్యతిరేకించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేటు తెస్తున్న విధానాలను వ్యతిరేకించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్‌ గారపాటి వెంకటసుబ్బారావు రైతు సంఘం నాయకులు కంకటాల బుద్ధుడుహొ హొపిలుపునిచ్చారు. లకింపూర్‌ 2021 సంవత్సరంలో జరిగిన సంఘటనకు నిరసనగా కేంద్ర రైతు సంఘం పిలుపుమేరకు బ్లాక్‌ డే కార్యక్రమాన్ని మంగళవారం చాగల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతాంగానికి నష్టాన్ని కలిగించే మూడు నల్ల చట్టాలను కేవలం పోరాటాలతోనే వెనక్కి తీసుకుందని తెలిపారు. ఇప్పటికీ రైతాంగం పెట్టిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం దుర్మార్గమన్నారు. పంటలకు మద్దతు ధర విషయంలో చట్టబద్ధత కల్పించకుండా రైతాంగానికి న్యాయం జరగదు అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధరలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగంలోని మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించి వ్యవసాయ రంగాన్ని నాశనం చేయాలని చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని రైతాంగం అందరికీ ఉన్న వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్లకు లక్షలాది కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వాలు రైతులకు ఎందుకు చేయవని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కొడవటి వెంకటరాయుడు, కొటారు నాగేశ్వరరావు, కొడవటి ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.