Oct 24,2020 17:44

డాక్టర్‌ దేవులపల్లి పద్మజ
nsranvesh@gmail.com

మధ్యాహ్నం 12 గంటలకి లేండ్‌ ఫోను మోగుతోంది. వరసగా ఇరవై రింగులు అయిపోయి మళ్ళీ మొదలైంది. ఎక్కడో అత్యవసర కాగితాన్ని వెతుక్కుంటూ కనపడక, తనని తనే తిట్టుకుంటున్న ప్రమీల ఫోన్‌లో ఎవరో అనుకుంటూ 'హలో..హలో..!' అంది.
అవతల నుంచి బెంగాలీలో 'అమీ....మోలీనా...!' అంది.
'తుమీ మోలీనా.....కొథారు...కైసే .. హౌ.....హమ్‌ సబ్‌ ఠీక్‌....!'.
ఇలా ఓ రెండు నిమిషాల సంభాషణ అనంతరం చాటంత మొహం చేసుకుని, గబగబా సెల్ఫోన్‌ నుంచి భర్తకి విషయం చేరవేసింది. 'రేపు పర్మిషను అవ్వీ దొరకదు అనకుండా సెలవు పెట్టేసి రండి!' అని హెచ్చరించింది....
ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో కొడుకు వంశీకృష్ణకి ''రేపు మోలీనా హౌరా..మద్రాసు..మెయిల్‌లో వస్తుందిరా...స్టేషన్‌కి వెళ్ళాలి'' అని ప్రమీల అనగానే, భర్త 'అదేమిటి మద్రాసు వెళ్తూంది అన్నావు... ఇంటికి వచ్చేటట్టైతే నువ్వు వెళ్లి తీసుకొచ్చేరు...నేను ఆఫీసుకి వెళ్లి పోతాను!' అన్నాడు...
'అయ్యా మహానుభావా పొరపాటుగా అన్నాను.. ట్రైన్‌లో మద్రాసు వెళ్తూంది. మనం మధ్యలో వైజాగ్‌లో భోజనం తీసుకుని వెళ్లి, చూసి ఇచ్చి రావాలి... ఇందులో ఏమీ మార్పు లేదు. సరే నా..!' అంది...
వంశీ ఇవన్నీ వింటూ..'మమ్మీ! మన ఇంటికి తిరిగి వెళ్లేప్పుడైనా రమ్మని చెప్పు..' అన్నాడు కళ్ళు ఇంతింత చేసుకుని సంబరంగా.
ఇంత చర్చకు కారణమైన ఆ మోలీనా 'ఓ 70 ఏళ్ళు పైబడిన ఆ ఇంటి గత పనిమనిషి.' అసలు ఆ మాటంటే వారికి నచ్చదు.. ఆ ఇంటిమనిషే అనుకుంటారు.
ఓ పదిహేనేళ్ళు వెనక్కి వెళితే.....కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రామచంద్ర... కోల్‌కతా సిటీకి బదిలీపై వెళ్లి ఓ పదేళ్ళ పాటు అక్కడే పనిచేసి.. తిరిగి వైజాగ్‌ వచ్చి కూడా చాలా కాలమైంది... అక్కడ ప్రభుత్వ వసతి, సౌకర్యాలు అనుకూలంగా హాయిగా ఉండేవి.
ఒక్క భాష విషయంలో తప్ప మరేమీ ఇబ్బంది లేదు. అక్కడా ఒక వెసులుబాటు వుండేది.. మనకి బడిలో నేర్పిన హిందీ, దూరదర్శన్‌ టీవీ వారి సీరియళ్ళు ఫలితంగా హిందీ బాగానే అర్థం అయ్యేది.. ఓ అరవై శాతం తప్పులు లేకుండా మాట్లాడ్డ వచ్చు. ఇక బెంగాలీ భాషపై శ్రద్ధ పెట్టి నేర్చుకోలేదు.
ఆ చిన్న కుటుంబానికి మోలీనా ఒక పనిమనిషిగా ఆ ఇంట ప్రవేశించి, తక్కువ కాలంలోనే వారందరికీ ఆప్తురాలైపోయింది... ఆమె వ్యక్తిత్వం, దురాశ లేకపోవడం, అవసరమైతే ఏదైనా పంచి ఇచ్చే మంచి గుణం, ముఖ్యంగా దొరికితే దోచేసే దొంగబుద్ధికి దూరంగా ఉండడం... ఎదుటివారి మనసుకి, పద్ధతికి అలవాటు పడటం అందరికీ నచ్చిన విషయం. ఆమెకి ఒక ఇరవై ఏళ్ళ కొడుకు మాత్రమే ఉన్నాడు. ఇక ఎవరూ లేరు బంధువులు. భర్త మరణించాక ఈ పని చేసుకుంటూ కాలం గడుపుతోంది.
అన్నం అంతా చూడక్కరలేదు ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది.. అన్న చందాన.. రామచంద్ర, ప్రమీల, వంశీకి విడివిడిగా అనేక అనుభవాలు ఆమెతో..

వంశీ రెండు సంవత్సరాల వయసులో ఆమెకి చేరువయ్యాడు. ఒక్కరోజు రాకపోతే ఏడ్చేసేవాడు కనపడేదాకా.
ఒకసారి రామచంద్ర ఆఫీసు పనిమీద క్యాంపుకి మూడు రోజులు పాట్నా వెళ్లాడు. రోజూ మోలీనా వీళ్ళతో పాటే ఎదురుగా ఉన్న మార్వాడీ కుటుంబానికి పని చేసుకుని వెళ్లిపోయేది. ఇంట్లో ఉన్నంతసేపూ ఆవిడకి వచ్చిన భాషలో ఏవేవో మంచీ చెడూ అన్నీ చెప్పేది. ప్రమీలకి ఏమర్థమయ్యేదో హిందీలో సమాధానం చెప్పేస్తూ ఇద్దరూ ఆవగింజ నుంచి అణుబాంబు వరకూ మాట్లాడేసుకునేవారు. ఫిల్టర్‌ కాఫీ మోలీనాకి అలవాటు చేసింది ప్రమీల. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పని అయిపోయాక కాఫీ తాగి వెళ్ళిపోయేది.
ఆ కాఫీ చేసే సమయంలోనే ఒకరోజు స్టౌ దగ్గర ఉన్న ప్రమీల సడెన్‌గా కింద పడిపోయింది. చేస్తున్న పని అలా వదిలేసి, ఆమెని లేవదీసి మంచందాకా తీసికెళ్ళి పడుకోబెట్టింది మోలీనా. పడిపోవడం వలన ప్రమీల తలకి దెబ్బ తగిలి, వాచిపోయింది. డీఫ్రిజ్‌లో ఉన్న ఐస్‌ బద్దలు కొట్టి ఆ వాచిపోయిన భాగంలో పట్టి ఉంచింది. ప్రమీలని స్పృహలోకి తెచ్చే ప్రయత్నంలో గట్టిగా కేకలు వేసింది. అయినా ప్రమీల కళ్ళు తెరవలేదు.. ఈ కేకలకి నిద్రపోతున్న వంశీ ఉలిక్కి పడి లేచి ఏడుపు మొదలెట్టాడు. కంగారుగా వచ్చి మోలీనాని చుట్టేశాడు.
ఏమీ చదువుకోలేదుగానీ లోకం పోకడ బాగా తెలుసు కదా! గబగబా దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి ఫోన్‌ చేసింది... అంబులెన్స్‌ పంపమని.. స్విస్పార్క నర్సింగ్‌ హోం నుంచి అంబులెన్స్‌ వచ్చింది.
గబగబా ఇల్లు తాళం వేసి, వంశీని ఎత్తుకుని ప్రమీలని హాస్పిటల్‌లో చేర్పించింది. అపుడు రామచంద్రకి చెప్పాలని నంబరు తనదగ్గరి రాసిపెట్టుకున్న చిన్న పుస్తకం తీసి డాక్టర్‌కి ఇచ్చి, ''వారికి ఫోన్‌ చేసి ఏమి జరుగుతుందో చెప్పండి'' అంది. ఆ డాక్టర్‌ ప్రమీల పరిస్థితి రామచంద్రకి వివరించారు... అక్కడ దూరంగా ఉన్న రామచంద్రకి సంగతి ఏమిటో, ఏమైందో తెలీక కంగారుగా ఉంది. 'నేను వెంటనే బయలుదేరుతాను!' అని తాను ఫలానా ఫలానా అనీ, తను వచ్చేవరకూ వైద్యలోపం లేకుండా చేయమనీ కోరాడు.
అప్పట్లో సెల్ఫోన్‌ నుంచి ఒక కాల్‌ పదిహేను రూపాయలు. ఎత్తి 'హలో' అనే లోపు పెరిగిపోతూ ఉండేది బిల్లు. డాక్టర్‌ అన్నీ పరీక్షలు చేసి, 'కంగారులేదు.. రక్తహీనత ప్రాణగండం వరకూ తీసుకొచ్చింది... అవసరమైతే రక్తం ఎక్కించాలి. అయితే మాకు ఎవరైనా ఒక బాటిల్‌ రక్తం ఇవ్వగలిగితేనే మేము మా వద్ద ఉన్న రక్తం వాడగలం!' అని మోలీనాకి చెప్పారు.
తన రక్తం పనికి రాదన్నారు.. వైద్యులు.. టాక్సీడ్రైవరుగా పనిచేస్తున్న తన కొడుకుకి పబ్లిక్‌ బూత్‌ నుంచి ఫోన్‌ చేసి, రమ్మని చెప్పింది. అతను రాగానే పరీక్షించి, తీసుకోమని పురమాయించింది. అతని వయస్సులో చిన్నవాడే కదా త్వరగా రక్తం పడుతుందని చెప్పారు.
వంశీకి బ్రెడ్లు, బిస్కెట్లు పెడుతూ తనూ వాటితోనే గడిపేస్తూ- రెండురోజులు ప్రమీలాని కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూసింది. మూడవ రోజు రామచంద్ర డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వచ్చి, వారిని చూసి ''ఇక నువ్వు ఇంటికి వెళ్లి స్థిమితపడి రేపురా!'' అని చెప్పాడు మోలీనాకి. అయినా ఆమె, ప్రమీలాని ఇంటికి తీసుకొచ్చి, రామచంద్రకి జాగ్రత్తలు చెప్పిగానీ వెళ్లలేదు. ఆమె పెంపకంలో కొడుకు మారుమాట్లాడకుండా తల్లి చెప్పినట్టు చేయడం విశేషం.
రామచంద్ర- తన తల్లిని రెండు నెలలు ఇక్కడికి రావలసిందిగా.. కోడలికి సహాయంగా ఉండమని కోరితే.. ఆమె వచ్చింది. అతి ఛాందసురాలైన రామచంద్ర తల్లి భ్రమరాంబ కూడా మోలీనాని చూసి, కొన్నాళ్ళు గమనించి విశ్వసనీయమైనదని బంగారుపతకమూ ఇచ్చేసింది.
భ్రమరాంబ దగ్గర మంచిపేరు తెచ్చుకోవడం అంత సులభం కాదు. మరి అలాంటి మనిషి మన మనిషి కాక పనిమనిషిగా చూడగలమా....? కొంపలు కూల్చేవారు, ఇల్లు గుల్ల చేసేవారు, ఈ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఇక్కడవి అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పుకుంటూ అవసరాలు నడుపుకునేవారు.. మరొకరితో చేతులు కలిపి, పిల్లలను ఎత్తుకుపోవడాలు.. పనిమనిషిగా ప్రవేశించి, ఇల్లాలై కుటుంబాన్ని వీధిలోకి నెట్టేవారిని.. ఎన్ని రకాల వారిని నిత్యం లోకంలో చూడడం లేదు. ఇన్ని తెలిసిన అనుభవంతో అత్తగారు మోలీనాకి గోల్డ్‌ మెడల్‌ వంటి కితాబు ఇచ్చారని అనుకునేది ప్రమీల.
మరి కొన్నేళ్ళు గడిచాక తిరిగి బదిలీపై వైజాగ్‌ వచ్చేశారు. వచ్చాక ఆరు నెలలకి వెళ్లి వంశీకి ఆమెని చూపించి, ఆఫీసు గెస్ట్‌హౌస్‌లో మూడు రోజులు ఉన్నారు. మోలీనాతో కలిసి సైన్స్‌ సిటీ, నిక్కో పార్క్‌, టాటా ప్లానిటోరియం, బిర్లా టెంపుల్‌, కాళీఘాట్‌, దక్షిణేశ్వర్‌లాంటి వన్నీ తిరిగారు. ఆ తర్వాత ఆఫీసులో ఫ్రెండ్స్‌ని కలిసి వచ్చారు. ప్రతి ఆదివారం ఒక రౌండ్‌ తిప్పవలసిందే వంశీని.. అదే అనుబంధం ఆమెతో.. ఆ తరువాత ఫోన్‌ సంభాషణలు. ఇన్నాళ్ళు గడిచాక మరల చూడబోతున్నామని సంతోషం. 'ఆ ఏమిటి పనిమనిషేగా అని కాకుండా.. పండక్కి, పుట్టినరోజుకి గుర్తుగా ఫోన్‌ చేసే మనం అనుకునే మనిషిని రేపు చూస్తున్నాము!' అని ప్రమీల వంశీతో అంది.
'మోలీనాకి మనం చేసుకునే పులిహోర అంటే ఇష్టం!' అంటూ ప్రమీల పులిహోర చేసి, బజారు నుంచి తెచ్చిన లడ్డూలు జతచేసి, భోజనం సిద్ధం చేసింది. భర్తతో కలిసి స్టేషన్‌కి వెళ్ళింది. అలవాటుగానే అరగంట ఆలస్యంగా వచ్చిన ట్రైన్‌ యస్‌ 5 నుంచి మోలీనా దూరం నుంచే వీళ్లను గమనించి, చేతులూపేస్తోంది.. చాలా పెద్దదైపోయింది. పిల్లాడు రాలేదని మోలీనా మొహం చిన్న బుచ్చుకుంది. అది గమనించి, 'వెనక్కి కోల్‌కతా వెళ్లేటప్పుడు చూసివెళ్ళమని నీకు చెప్పమన్నాడు!' అని ముందుగానే చెప్పేసింది ప్రమీల.
అక్కడ ఇరవై నిమిషాలు మాత్రమే ట్రైన్‌ ఆగుతుంది.. తెచ్చినవన్నీ ప్రమీలా, రామచంద్ర ఆమెతో సీటు దగ్గరకి వెళ్లి, అక్కడ పెట్టేశారు. మోలీనా కృతజ్ఞతగా రామచంద్ర కాళ్ళకి నమస్కరించబోయింది. ఆ ఉన్న కాస్త సమయంలోనే అనేక విషయాలు ఎవరిభాషలో వారు చెప్పేశారు. ప్రమీలని దగ్గరకి తీసుకుని, ప్రేమగా చేతులు నిమురుతూ 'తప్పకుండా వస్తానని వంశీకి చెప్పు!' అంది...
ఈ దృశ్యాలను చూస్తూన్న ఎదుటి సీట్లలోఉన్న వారికి వీరి మధ్య సంబంధం ఏమిటో అర్థం కాక తెలుగు. బెంగాలీల మధ్య బంధుత్వం కాదని అనుకుంటూ.. ఉండబట్టలేక ఒకాయన అడిగేశాడు. సమాధానం చెప్పేలోగా సిగల్‌ ఇచ్చారు.
ట్రైన్‌ కదులుతోందని గబగబా రామచంద్ర, ప్రమీల, ఆమె దగ్గర సెలవు తీసుకుని, కిందికి దిగడానికి వెనుతిరిగారు...
'పొగరు... సమాధానమే చెప్పలేదు!' తనలో తను గొణుక్కుంటున్న వ్యక్తికి మోలీనా సమాధానం చెప్పింది. 'నేను వారి ఇంట్లో కొంతకాలం పనిచేశాను' అని. ఆ మాటలు విన్న పక్కనే ఉన్న తెలుగువారు 'పనిమనిషిని కలవడానికి వచ్చారట! కలికాలం. అందుకే నెత్తినెక్కి, సాము చేస్తున్నారు పనివాళ్ళు' అన్నారు.
ఆ మాటలు వినగానే ముందుకు అడుగేయబోయిన రామచంద్ర వేగంగా తిరిగి, ఆ మాటలు వచ్చిన వైపు 'అయ్యా! పుట్టుకతో వృత్తి, ఉద్యోగం రావు. వారి వారి అవకాశాలు, అవసరం, నేర్పులను బట్టి వారికి నచ్చినది, వచ్చినది పనిచేసుకుంటూ బతుకు ఈడుస్తారు. ఏ పనిచేసినా, నిబద్ధత, వృత్తి ధర్మం అలవరచుకోవాలి. వీటన్నిటితో పాటు ఆమెలో మంచిమనిషీ వుండటం వలన మాకు మీరనుకున్నట్లు పనిమనిషిగా కాదు, మా మనిషిగా భావించి వచ్చాము చూడటానికి. ఏ కాలంలోనైనా మానవుల నైజం మీదే సమాజ గమనం సాగుతుంది. అందరిలోనూ కనిపించని మానవత్వం ఆమెలో ఉంది. మాకు మాత్రం ఆమె మా ఇంటిమనిషే!' అని కొంచెం కఠినంగానే చెప్పేసి అడుగులు ముందుకు వేశాడు.
'అనవసరంగా అతని మనసు బాధ పెట్టారు!' అని, ఆ మాటలన్న అతని భార్య అనడం.. వారిద్దరూ రామచంద్ర వెనుకే వస్తూ 'మన్నించండి! పనిమనుషులతో మాకున్న అనుభవాలు అలా అనిపించాయి. అంతే మనసులో ఏమీ పెట్టుకోకండి!!' అన్నారు.
స్నేహ పూర్వకంగా రామచంద్ర ఒక నవ్వు నవ్వి, 'సరే సార్‌! సెలవ్‌!' అంటూ కంపార్టుమెంటులో నుండి దిగిపోయాడు.
మనసులు గెలుచుకున్న మోలీనాకి చెయ్యి ఊపుతూ టాటా చెప్పేసి.. భర్తను అనుసరించింది ప్రమీల చిరునవ్వుతో.