సాధారణంగా సోదాలు...ఆ సోదాల్లో పట్టుకునే వాటి నుంచి చట్టబద్ధమైన దర్యాప్తు ప్రారంభమౌతుంది. ఇది ప్రాథమికంగా అందిన సమాచారం ప్రాతిపదికన జరుగుతుంది. కానీ, స్వతంత్ర డిజిటల్ న్యూస్ పోర్టల్ అయిన 'న్యూస్ క్లిక్' కార్యాలయంపై, ఆ పోర్టల్ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రమోటర్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) దాడులు జరిగిన నేపథ్యంలో మీడియా సంస్థల నుండి తీవ్ర ఖండనలు, విమర్శలు ఎదురయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న రైతాంగ నిరసనలపై అలాగే ప్రజలు, వారికి ప్రాతినిధ్యం వహించే కింది స్థాయి సంస్థలు, సంఘాలు సాగిస్తున్న పోరాటాలపై కూలంకషంగా, విస్తృతంగా కవరేజ్ చేస్తున్నందుకే ఈ దాడులు జరిగాయనడానికి చాలా అవకాశాలు వున్నాయి. కొన్ని మాసాల క్రితం ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో దాదాపు రూ.30 కోట్ల మేరకు జరిగినట్లుగా భావిస్తున్న మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేస్తున్నామని ఇ.డి తెలిపింది. పోలీసు కేసు స్వభావం ఎలాంటిదో బాగా తెలియకపోయినా, 'ప్రిడికేట్ నేరం' (నేరం జరుగుతుందన్న అంచనా)కి సంబంధించిన నేరం ద్వారా వచ్చిన లాభాలు దుర్వినియోగం చేయబడినట్లైతే...దర్యాప్తు జరపడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ద్వారా ఇ.డి కి సర్వాధికారాలు వున్నాయి. అయితే అటువంటి ప్రాథమిక నేరం జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే, దానికి 'న్యూస్ క్లిక్'కు ఏ రకంగానైనా సంబంధం వుందా లేదా అనేది ఇక్కడ స్పష్టంగా లేదు. అయితే, ప్రభుత్వాన్ని మౌఖికంగా విమర్శించే ఎవరిపైనా అయినా వాస్తవిక లేదా ఊహాజనిత ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ నేరుగా రంగంలోకి దిగడం లేదు. అదే సమయంలో, ప్రస్తుతం సాగుతున్న రైతాంగ నిరసనలు, అలాగే గతేడాది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఆందోళనలను విస్తృతంగా కవరేజ్ చేసినందుకే 'న్యూస్ క్లిక్'ను లక్ష్యంగా పెట్టుకున్నారన్న అనుమానాలను కొట్టిపారేయడం కూడా కష్టసాధ్యమే.
అసమ్మతి గళాలను అదుపులోకి తెచ్చుకోవడానికి సిబిఐ, ఇ.డి, ఐ.టి, చివరకు ఎన్‌ఐఎ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించే విషయానికి వస్తే ప్రస్తుత ప్రభుత్వ రికార్డు చాలా పేలవంగా వుంది. కొన్ని వర్గాల్లో వచ్చే ప్రతికూలతకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ పోరాటాల్లో ఒత్తిడి తీసుకువచ్చే శక్తులుగా ప్రత్యేక సంస్థలను అనుమతించడం దురదృష్టకరం. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రకాల కుట్రలు వున్నాయన్న వాదనల నడుమ-ప్రజల సాధకబాధలను పరిష్కరించే క్రమంలో తీసుకునే మౌలిక చర్యలైన - నిరసనలు, ఆందోళనలపై అవిశ్రాంతంగా జర్నలిస్టు తరహాలో దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో వాటిని అణచివేసే చర్యలు తలెత్తడంలో ఆశ్చర్యమేమీ లేదు. స్వభావరీత్యా తీవ్రమైన, అంత తేలికగా వర్తింపచేయలేని చట్టాలను ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తమవుతున్న వారిపై ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసినా, రాసినా దేశ ద్రోహ నేరం మోపుతున్న తీరును ఇది వివరిస్తుంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు, అటువంటి కథనాలను రూపొందించడానికి సిద్ధంగా వున్నవారిపై 'చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం' కింద చర్య తీసుకోవడానికి దారి తీస్తున్నాయి. ఇతర ఉదాహరణల్లో చెప్పాలంటే, సామాజిక శతృత్వాన్ని పెంపొందించే లేదా మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే కేసులను ఎంపిక చేసిన కమెడియన్లపై, స్క్రిప్ట్ రైటర్లపై మోపుతున్నారు. పరువు నష్టం కలిగించేలా ట్వీట్లు చేశారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టులు అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు జోక్యం ఉపయోగపడింది. ఆ తర్వాత ఆ ట్వీట్లు అవాస్తవమని తేలింది. జర్నలిస్టులతో సహా విదేశీ శక్తులచే ప్రేరేపించబడిన లేదా ప్రేరణ పొంది అసమ్మతివాదుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై వస్తున్న విమర్శలు తోసిపుచ్చడానికి బాధ్యతాయుతమైన, స్పందించే ప్రభుత్వం ఇక లేదు. (అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారన్న అనుమానాలకు తావుండరాదు.)
('ది హిందూ' సంపాదకీయం)










