వాషింగ్టన్ : పాలస్తీనాకు మద్దతుగా వందలాది మంది మీడియా కార్మికులు గురువారం న్యూయార్క్ టైమ్స్ సంస్థ ఎదుట బైఠాయించారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధానికి సంబంధించిన వార్తల కవరేజీలో మీడియా ఇజ్రాయిల్ పట్ల పక్షపాతం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్‌హట్టన్‌లోని ప్రధాన కార్యాలయం ఎదుట 'రైటర్స్ బ్లాక్ ' వందలాది మంది మీడియా వర్కర్స్ నిరసన ప్రదర్శన చేపట్టారు. గంటకు పైగా ఈ ప్రదర్శన కొనసాగింది.
గాజాలో ఇజ్రాయిల్ కొనసాగించిన నరమేథంలో మరణించిన 36 మంది జర్నలిస్టులతో పాటు వేలాది మంది పేర్లను ప్రచురించిన పేజీలను ప్రదర్శించారు. ఆ ప్రచురణను ఖండిస్తూ.. ఆ పేర్లను చదివి వినిపించారు. 'ది న్యూయార్క్ వార్ క్రైమ్స్' లో ప్రచురించే కథనాలు ఇజ్రాయిల్ నరమేథానికి మద్దతు తెలుపుతున్నట్లు ఉన్నాయని మండిపడ్డారు. ఆ కథనాలు ప్రచురించిన పేపర్స్‌ను చింపివేశారు. బహిరంగంగా కాల్పుల విరమణకు మద్దతు పలకాలని ఎడిటోరియల్ బోర్డ్‌ని డిమాండ్ చేశారు.
గతవారం కూడా వందలాది మంది గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్‌లో ఇప్పుడే కాల్పుల విరమణ అని రాసి వున్న బ్యానర్‌లను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. మంగళవారం కార్యకర్తలు జెవిష్ వాయిస్ ఫర్ పీస్ బృందంతో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎదుట ప్రదర్శన చేపట్టారు. ఇజ్రాయిల్ అమానవీయ దాడితో గాజాలో ఇప్పటివరకు 10,800 మందికి పైగా మరణించగా, వేలాది గాయపడినట్లు పాలస్తీనా వైద్య శాఖ ప్రకటించింది.