ప్రజాశక్తి - తాడేపల్లి : రానున్న కాలంలో తాడేపల్లి పట్టణాన్ని మురుగు ముంచెత్తనుందని ఫారెస్టు ప్రాంత ప్రజల మౌలిక సమస్యల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. యుద్ధ ప్రాతిపదికన డ్రెయినేజీ మురుగు సమస్యను పరిష్కరించడానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేసింది. శుక్రవారం ఆ జెఎసి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రజలతో ప్రజాసత్యాగ్రహ దీక్షలను జెఎసి కన్వీనర్ వేముల దుర్గారావు ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలోని ఫారెస్టు ప్రాంతంలో ఉన్న వివిధ కాలనీల్లో అన్ని మెయిన్‌రోడ్లను సిమెంటు రోడ్లుగా మార్చాలని, పక్కా డ్రెయిన్లు నిర్మించాలని కోరారు. 30 ఏళ్లుగా ఫారెస్టు ప్రాంతంలో వివిధ కాలనీలు ఏర్పాటుచేసుకొని 3వేల దళిత మైనారిటీలకు చెందిన పేద కుటుంబాలు నివసిస్తున్నాయని గుర్తుచేశారు. డ్రెయినేజీ సౌకర్యం సరిగా లేక మురుగునీటితో నానా అగచాట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రెయినేజీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరారు. ఫారెస్టు ప్రాంతాన్ని డీఫారెస్టుగా మార్చి ఇక్కడున్న నివాసులందరికీ పట్టాలు ఇచ్చి రెగ్యులర్ చేయాలన్నారు. పట్టణ పౌర సంక్షేమసంఘం నాయకులు సోలా ముత్యాలరావు మాట్లాడుతూ మున్సిపాలిటీకి అన్ని రకాల పన్నులు ఇక్కడ ప్రజలు చెల్లిస్తున్నా సౌకర్యానికి మాత్రం నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. జెఎసి నాయకులు ఎ.శౌరిభర్తులోమ్ మాట్లాడుతూ సిఎం నివాసముంటున్న తాడేపల్లి మున్సిపాలిటీలోనే ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఈ దీక్షలో బి.యెషయ, ఎన్.దుర్గారావు, టి.వెంకన్న, నాగమణి, మల్లేశ్వరి, వి.రమణ, టి.జక్రయ్య, మహ్మద్ ఆలీ, కుసుమ, శ్రీను, నబి, వీరయ్య, కె.నాని, పూర్ణ, రాము లమ్మ, సత్తార్, నజీర్, పాస్టర్ యోగయ్య, నాగేశ్వరరావు, శాస్త్రి, ఎస్‌కె.బాజి, రహ్మత్‌బి, బి.వెంకన్న, కంచర్ల కాశ య్య, పెద్దఎత్తున ఫారెస్టు ప్రాంతవాసులు పాల్గొన్నారు.










