
జాతీయోద్యమ నాయకుడు, భారతదేశ తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నవంబర్ 11న జన్మించి, 1958లో మరణించారు. 1920లో భారత జాతీయ కాంగ్రెస్‌లో సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన కీలక ఘట్టాలలో ముఖ్య పాత్ర పోషించారు. 1923, 1940 సంవత్సరాలలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 1947 నుండి 1958లో మరణించే వరకు భారత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' వంటి ముఖ్య గ్రంథాలను రచించారు. మరణానంతరం 1992లో 'భారతరత్న' అవార్డు పొందారు.
లౌకిక వాదానికి ప్రతీక
భిన్న మతాలకు స్థానమైన భారతదేశాన్ని లౌకిక విధానమే రక్షిస్తుందని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ విశ్వసించారు. జాతీయోద్యమ కాలంలో మతతత్వాన్ని వ్యతిరేకించి, లౌకికవాద ఆవశ్యకతను చాటి చెప్పారు. హిందూత్వను, ముస్లిం మతతత్వాన్ని...రెండింటిని వ్యతిరేకించారు. మహ్మదాలీ జిన్నా ప్రతిపాదించిన 'ద్వి జాతి' సిద్ధాంతాన్ని, 1940లో ప్రతిపాదించిన ప్రత్యేక పాకిస్తాన్ తీర్మానాన్ని, దేశ విభజనను వ్యతిరేకించి లౌకిక భావాలకు ప్రతీకగా నిలబడ్డారు. దేశ విభజన ఆపలేకపోయానని ఆవేదన చెందారు. రాజ్యాంగ రచన సమయంలో భారతదేశం లౌకిక రాజ్యంగా కొనసాగాలని ప్రతిపాదించారు.
నేడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆశయాలను దెబ్బ తీసే విధంగా దేశంలో పరిణామాలు కొనసాగుతున్నాయి. మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం, సంఘ పరివార్ కలసి భారత రాజ్య లౌకిక స్వభావాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో ప్రజల మధ్య మతపరమైన విభజన తేవటానికి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నాయి. గత ఆరేళ్లగా మైనారిటీలపై జరుగుతున్న దాడులన్నీ లౌకిక విధానాన్ని దెబ్బ తీసేవే. భిన్న మతాలు కలిగిన భారత దేశంలో మత సామరస్యం, లౌకికవాదం మాత్రమే దేశ సమైక్యతను కాపాడతాయి.
మైనారిటీల సంక్షేమం
భారత రాజ్యాంగం ద్వారా మైనారిటీల హక్కులు సంరక్షించబడాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, నెహ్రూ వంటి వారు భావించారు. మత పరమైన, భాషా పరమైన మైనారిటీల సంరక్షణకు, హక్కులకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో అనేక నిబంధనలు పొందుపరచారు. 29, 30 నిబంధనల ద్వారా మైనారిటీలకు విద్యా సాంస్కృతిక హక్కులు పొందుపరచారు. మైనారిటీ విద్యా సంస్థలకు రక్షణ కల్పించారు. కానీ రాజ్యాంగం అమలు లోకి వచ్చిన 7 దశాబ్దాల తరువాత ముస్లిం మైనారిటీల ఆర్థిక, సామాజిక, విద్య మొదలగు అనేక రంగాలలో వెనుకబడే ఉన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం 2005లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ 2007లో నివేదిక సమర్పించింది. సచార్ కమిటీ స్పష్టంగా ముస్లింల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని గణాంకాలతో సహా వెల్లడించింది. విద్యలో గాని, ఉపాధి, ఉద్యోగాలలో గాని ముస్లింలకు జనాభాకు తగిన ప్రాతినిధ్యం లేదని చెప్పింది. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు సూచించింది. కాని ఆచరణలో సచార్ కమిటీ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. కేంద్రంతోపాటు, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు కూడా మైనారిటీల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయి.
ప్రభుత్వ విద్యా రంగానికి ప్రాధాన్యత
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ భారత దేశ తొలి విద్యా మంత్రిగా పని చేసి ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయడంలో, అనేక సంస్థలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1951లో భారతదేశ తొలి ఐఐటి ని ఏర్పాటు చేయటమేకాక బెంగుళూరులో 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్' ఏర్పాటు చేయించారు. 1953లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఏర్పాటు చేయడమేకాక, 1956లో యుజిసి కి చట్టబద్ధత కల్పించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలో చెప్పినట్లుగా పిల్లలందరికి ఉచిత, నిర్బంధ విద్య అందించటానికి...ప్రభుత్వ రంగంలోనే విద్య అభివృద్ధి చెందాలని భావించి, దానికనుగుణంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన 'అలీగఢ్ ముస్లిం' యూనివర్శిటీ వంటి సంస్థలకు రాజ్యాంగ నిబంధనల ఆధారంగా మైనారిటీ హోదా కల్పించారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన శాంతినికేతన్ వంటి విద్యా సంస్థలకు సెంట్రల్ యూనివర్శిటీ హోదా కల్పించారు. ఢిల్లీలో 'జామియా మిలియా ఇస్లామియా' యూనివర్శిటీ స్థాపనకు అంకురార్పణ చేశారు. విద్య ప్రజలందరికి అందాలని, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాలని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ భావించారు.
కాని భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తరువాత విద్యా రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చోటుచేసుకున్నది. 1990లో దేశంలో 450 యూనివర్శిటీలు ఉండగా 2019 నాటికి 907కి పెరిగాయి. వీటిలో సగ భాగం ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలే. దేశంలో వున్న 40,000 డిగ్రీ కళాశాలల్లో 65 శాతం ప్రైవేటు కళశాలలే. గత మూడు దశాబ్దాలలో విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చోటు చేసుకుని, విద్య వ్యాపారం కొనసాగుతున్నది. ప్రైవేటు రంగాలలో స్థాపించిన విద్యాలయాలపై సరైన నియంత్రణ లేకపోవడంతో నాణ్యత లోపించింది. విద్య మార్కెట్ వస్తువుగా మారింది. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆకాంక్షలకు భిన్నంగా విద్యా రంగంలో పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నూతన విద్యా విధానం - మూడు 'సి'లు
కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 'నూతన విద్యా విధానం-2020'ను కేంద్ర క్యాబినెట్ 2020 జూలై 29న ఆమోదించింది. ఈ నూతన విద్యా విధాన సారాంశాన్ని 3 'సి' లుగా కేంద్రీకరణ (సెంట్రలైజేషన్), వ్యాపారీకరణ (కమర్షియలైజేషన్), మతతత్వీకరణ (కమ్యూనలైజేషన్)గా భావిస్తున్నారు. నూతన విద్యా విధానం విద్యా రంగంపై కేంద్ర ఆధిపత్యాన్ని పెంచే విధంగా ఉన్నది. విద్య 1950లో రాష్ట్ర జాబితాలో ఉంటే, 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఇప్పుడు పూర్తిగా తన ఆధిపత్యం ఉండాలని కేంద్రం భావిస్తున్నది. అలాగే నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) విద్యా రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు నిస్వార్థంగా విద్యా సేవ చేయాలని సూక్తులు చెప్పింది. కానీ ఆచరణలో ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరపటమేకాక, అంతర్జాతీయ విద్యా సంస్థలకు తలుపులు బార్లా తెరుస్తున్నారు.
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఏర్పాటు చేసిన యుజిసి వంటి సంస్థలను రద్దు చేయాలని ఎన్‌ఇపి ప్రతిపాదించింది. ఈ విధానంలో ప్రతిపాదించినట్లుగా జిల్లాకి ఒకటి చొప్పున బహుళ శాస్త్ర విద్యాలయాలను ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేస్తే విద్య వ్యాపారం విస్త్రుతం అవుతుంది. అనుబంధ కళాశాలల వ్యవస్థను రద్దు చేయాలనే ప్రతిపాదన వలన డిగ్రీ కళాశాలలపై పర్యవేక్షణ తగ్గి, విద్య మరింతగా వ్యాపారీకరణ అవుతుంది. స్థూల నమోదు నిష్పత్తి 26.3 నుండి 2035 నాటికి 50 శాతానికి పెంచాలనే లక్ష్యం మంచిదే అయినప్పటికీ, సాధించే మార్గాలను నిర్దిష్టంగా ప్రతిపాదించలేదు.
పై అంశాలతో పాటు నూతన విద్యా విధానంలో నైతిక విలువల పెంపుదల పేరుతో మతతత్వాన్ని ప్రోత్సహించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నతమైన వ్యక్తిత్వంతో, ఆశయాలతో, లక్ష్యాలతో జాతీయోద్యమంలో పాల్గొని, రాజ్యాంగ రచనలో భాగస్వామిగా ఉండి, స్వతంత్ర భారత దేశంలో విద్యా మంత్రిగా ప్రజల కోసం, మైనార్టీల కోసం సేవలు అందించారు. కాని నేడు ఆయన ఆశించిన లౌకికవాదం, ఆర్థిక, సామాజిక న్యాయం, ప్రభుత్వ విద్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అబుల్ కలాం ఆశయాల సాధనకు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పునరంకితం కావాలి.
(వ్యాసకర్త శాసనమండలి సభ్యులు,
సెల్ : 94402 62072)










