Dec 10,2020 06:37

ఐక్యరాజ్య సమితి 1948లో డిసెంబరు 10వ తేదీన ప్రపంచ మానవ హక్కుల దినంగా ప్రకటించింది. అప్పటి నుండి అనేక దేశాల్లో మానవ హక్కులకు ప్రాచుర్యం లభిస్తోంది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిశాకే మానవ హక్కుల దినోత్సవం జరపాలన్న ప్రకటన వచ్చింది. శాంతి నెలకొల్పాలన్న ఆకాంక్ష కూడా ఈ ప్రకటనలో ఇమిడి వుంది. ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ పటం మీద అనేక సోషలిస్టు ప్రజాస్వామ్య దేశాల ఆవిష్కరణ జరిగింది. అయినా వివిధ దేశాల లోపల బయట కూడా మానవ హక్కుల 'హననం' జరుగుతూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మరో ప్రపంచయుద్ధం రాలేదు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. అయినప్పటికీ వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అవి స్థానిక యుద్ధాలకు దారితీశాయి. ఆర్థికంగా బలమైన దేశాలు, బలహీనమైన దేశాలపై యుద్ధాలు చేశాయి. దండయాత్రలే చేశాయని చెప్పవచ్చేమో. దక్షిణ అమెరికా దేశాలలోని సహజ వనరులను కొల్లగొట్టేందుకు అమెరికా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పెట్టే తంపులు... చేసే దాడులు...ఇరాక్‌పై యుద్ధం, పాలస్తీనా పై ఇజ్రాయిల్‌ దురాక్రమణ వగైరాలు మనం చూస్తున్నాం కదా! ఇదిలా ఉంటే మతం పేరుతో జరిగే దాడులు, దౌర్జన్యాలు ప్రజల జీవితాలను చిందర వందర చేస్తున్నాయి. రోహింగ్యాల సమస్య అదే కదా? బర్మాలో పుట్టి పెరిగిన 'రోహింగ్యా'లు సొంత గడ్డ నుండి తరమబడి పక్కన ఉన్న బంగ్లాదేశ్‌ లోనూ, మన దేశంలోనూ తలదాచుకున్నారు. ప్రపంచ వ్యాప్తితంగా ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలో కూడా మానవ హక్కులు ఉల్లంఘన పెరుగుతోంది. మరోవైపు హక్కులు ఉద్యమానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇదిలా వుండగా, ధనిక పేద తారతమ్యాలు పెరుగుతున్నాయి. వేల సంవత్సరాల మానవాభివృద్ధి ఫలాలు కొన్ని దేశాలకు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని సామాజిక తరగతులకు మాత్రమే దక్కుతున్నాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా ఖండాల్లో అనేక దేశాలు పేదరికంలో కూరుకుపోయాయి.


మన దేశంలో కూడా దళితులు, మైనారిటీలు, మహిళలు, ఇంకా బలహీన వర్గాలు అభివృద్ధి ఫలాల నుండి నెట్టివేయబడుతున్నారు. ప్రపంచబ్యాంకు ఆర్థిక విధానల వల్ల అనేక దేశాల్లో ఈ అసమానతలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. ఈ అణగారిన వర్గాలు ఎంత కాలం ఓర్చుకుంటాయి? గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది. ప్రజలు తిరగబడ్డ ప్రతిసారీ ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయి. మానవ హక్కులూ లేవు. మట్టి గడ్డలూ లేవు. రాజధానిలో లక్షలాది మంది రైతుల పోరాటం ఇదే పాఠం చెప్తోంది. అంగ వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా జనం కోసం నిలబడ్డ డా|| సాయిబాబు, స్టాన్‌స్వామి వంటి ఎందరో మేధావులు జైళ్ళలో మగ్గుతున్నారు. 1948లో మానవ హక్కుల ప్రకటనను అంకురార్పణ జరిగిందనుకున్నాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ మేధస్సు, ప్రజాతంత్ర భావాలు, అంతర్జాతీయంగా పౌరహక్కుల కోసం సాగిన పోరాటాల ఫలితంగా మన రాజ్యాంగంలో పౌర ప్రాథమిక హక్కులకు గ్యారంటీ లభించింది. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరికీ మానవ హక్కులు కల్పిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రకటన చేసింది. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించింది. జీవించే హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చింది. తాము చేసిన రాజ్యాంగానికి తామే తూట్లు పొడిచే పాలకులు అధికార పీఠాలను ఆక్రమించారు. తరతరాలుగా ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితాలు, త్యాగాలు వెనక్కి పోతాయన్న భయం ఆవరించింది.
డిసెంబరు 6న డా|| అంబేద్కర్‌ వర్థంతి. బాబ్రీ మసీదును కూల్చివేసిన దుర్దినం కూడా అదే. భారత ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ బాబ్రీ మసీదు కూల్చివేత. అంతకన్నా పెద్ద మచ్చ సుప్రీం కోర్టు తీర్పు. మసీదు కూల్చివేతలో పాల్గొన్న, ప్రోత్సహించిన వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అత్యున్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పు...కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవతే న్యాయాన్ని నిరాకరించిన వైనాన్ని తెలియజేస్తోంది.


భారత రాజ్యాంగాన్ని అది మనకందించిన సమాన హక్కుల్ని కాపాడుకోవడం మన అవసరం. కుల, మత సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా వివాహం చేసుకోవాలనుకునే వారికి, ప్రత్యేక వివాహ చట్టం 1956 లోనే వచ్చింది. అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా. నాడు జనంలో ఎక్కువమంది నిరక్షరాస్యులు. మూఢనమ్మకాలు ఎక్కువ. కులాలు, మతాలుగా సమాజం చీలిపోయింది. మరి నేడో! పట్టణాల్లో జనం పెరిగారు. పక్కింటి వాళ్ళదే కులమో. ఎదురింటి వాళ్ళదే కులమో చెప్పందే తెలియదు. కలిసి బతుకుతున్నారు. కలిసి పని చేసుకుంటున్నారు. యువతీ యువకులు ఇష్టపడి కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. సమాజంగా అంగీకారం దిశగా అడుగులు వేస్తోంది. మరి పాలకులో? ప్రజల హక్కుల్ని పక్కకు నెట్టి కులతత్వాన్ని ప్రతిష్టించేవారు, స్త్రీల హక్కుల్ని భగం చేసే వారు పీఠాలనెక్కారు. రాజ్యాంగం వద్దు. మను ధర్మం ముద్దు అంటున్నారు.


ప్రజల్ని ముందుండి నడిపించాల్సిన పాలకులు వెనక్కి నడిపిస్తున్నారు. నడిచే పాదాలు ముందడుగు వేస్తాయి. కాని, 'లవ్‌ జిహాద్‌' పేరుతో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకొంటే జైల్లో పెడతానని హూంకరిస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్‌. అందుకు చట్టాలు తెచ్చాడు. అది రాజ్యాంగానికి విరుద్ధం కదా. ఈ యోగి చెప్పే పురాణాలే చూద్దాం. ప్రేమ వివాహాలు, స్వయం వరాలు గత చరిత్రలో పురాణాల్లో లేవా? రావణున్ని వరించిన మండోదరి ఎవరు? కృష్ణుని వరించిన రుక్మిణి, సత్యభామ, జాంబవతిదే కులం? భరతునికి జన్మనిచ్చిన శకుంతలది ఏ కులం? వేద వ్యాసునికి జన్మనిచ్చిన సత్యవతి ఎవరు? కృష్ణుని భక్తురాలు మీరాబాయి ఎవరు? జనం ఆరాధించే షిర్డీ సాయి బాబాది ఏ కులం? ఇంకా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. కాని వాటిని పకక్కనబెట్టి పురాణాల పేరుతో ప్రజల్లో మూఢవిశ్వాసాలను పెంచుతున్నారు హిందూత్వవాదులు.


దళితులు, మైనారిటీల మీద, స్త్రీల మీద హింస దాడులు నిత్యం జరగడం చూస్తున్నాం. హత్రాస్‌ ఘటనతో లోకం కంగుతిన్నది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్న ఘటనలు కాదు. 'నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అంటున్న మను ధర్మం పాటించే పాలకులు ఉండబట్టి...పుండు మీద కారం చల్లినట్లు బాధిత స్త్రీల నడవడి, వస్త్రధారణలపై నాయకుల కారుకూతలు రాజ్యాంగ హక్కులను భగం చేస్తున్నాయి. వందలు వేల సంవత్సరాలుగా సాధారణ జనం పోరాటం చేసి సాధించుకున్న సామాజిక సమాన హక్కుల్ని, పౌర ప్రజాస్వామిక హక్కుల్ని వెనక్కి పంపి...ఈ సమాజాన్ని బానిసత్వం దిశగా నెట్టే ప్రయత్నాలు పకడ్బందీగా జరుగుతున్నాయి. సతి దురాచారానికి-బాల్య వివాహాల నిరోధానికి, వితంతు పునర్వివాహాల కోసం ఉద్యమాలు సాగిన ఈ గడ్డ...మతం, కులం పేరుతో స్త్రీని కట్టు కొయ్యకు కట్టేసిన పశువుగా పరగణించే ప్రయత్నాలను మనువాదులు సాగిస్తున్నారు. ఈ దుస్థితిని ఎండగడదాం! చీకటిని తరిమేద్దాం. మహిళల హక్కులు మానవ హక్కులే అని ప్రకటిద్దాం!
                                                      * ఎస్‌. పుణ్యవతి (వ్యాసకర్త ఐద్వా జాతీయ కోశాధికారి )