May 21,2023 21:31
  • ఎల్‌ఐసి ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి దిలీప్‌

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : లాభాల్లో ఉన్న ఎల్‌ఐసిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎఫ్‌డిఐ, ఐపిఒ పేరుతో నిర్వీర్యం చేసి కారు చౌకగా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టడానికి చేస్తోన్న ప్రయత్నాలను విరమించాలని ఎల్‌ఐసి ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసి ఎఒఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ డిజి.దిలీప్‌ డిమాండ్‌ చేశారు. లేకుంటే ఎల్‌ఐసి ఉద్యోగులు, ప్రజలతో కలిసి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎల్‌ఐసి ఎఒఐ ఐదో సౌత్‌ జోనల్‌ (ఎపి, తెలంగాణ, కర్ణాటక) మహాసభ ఆదివారం విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎల్‌ఐసిని ప్రయివేటీకరిస్తే సంస్థ, పాలసీదారుల ప్రయోజనాలు, ప్రజల నమ్మకాలు, వేలాది మంది ఉద్యోగస్తులు, లక్షలాది మంది ఏజెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1956లో కేవలం రూ.5 వేల కోట్లతో ప్రారంభించబడిన ఎల్‌ఐసి ప్రస్తుతం రూ.42 లక్షల కోట్ల మూలధనంతో, 30 కోట్ల పాలసీదారులతో, 99.7 శాతం క్లయిములు పరిష్కారం చేస్తూ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. దేశ స్వావలంబనకు, అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న ఏకైక సంస్థగా ఎల్‌ఐసి పేరొందిందన్నారు. దేశ ప్రజల ప్రయోజనాల కన్నా, కార్పొరేట్‌ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని భావించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థనూ కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతోందని విమర్శించారు. దేశంలో కోట్లాదిమంది నిరుద్యోగులు ఉన్నారని, వారికి ఉద్యోగావకాశాలు కల్పించలేని కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసిలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధిని దెబ్బతీసే విధంగా ఐపిఒను తెరపైకి తేవడం దుర్మార్గమన్నారు. ఈ చర్యలను ఐక్య పోరాటాలతో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎల్‌ఐసి ఎదుగుదలలో ఏజెంట్ల శ్రమ ఎంతో ఉందన్నారు. అటువంటి సంస్థపై అదానీ, అంబానీల కన్నుపడిందని, ఐపిఒ పేరుతో తేలికగా స్వాహా చేయాలని చూస్తున్నారని తెలిపారు. కార్పొరేట్లకు దేశాన్ని తాకట్టుపెట్టే విధానం మంచిది కాదన్నారు. దేశానికి తాను వాచ్‌మ్యాన్‌నని చెప్పిన మోడీ... గేటు వద్ద కాపలా ఉండి దోమలను అడ్డుకొని, వెనుక నుంచి ఏనుగులను వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. లేబర్‌ కోడ్స్‌ను అమల్లోకి తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బిల్లు తీసుకొచ్చి నాలుగైదు రెట్లు కరెంట్‌ బిల్లులను పెంచిందని, ఆస్తి, చెత్త పన్నుల భారాన్ని విపరీతం చేసిందని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు దారుణంగా పెరిగాయన్నారు. ఈ ఆర్థిక భారాల కారణంగా ప్రజలు పొదుపు చేసే అవకాశాన్ని, శక్తిని కోల్పోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎల్‌ఐసిని, ఏజెంట్లను రక్షించుకోవడానికి పోరాటం తప్ప, మరొక మార్గం లేదన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మే హక్కు మోడీకి ఎక్కడిదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను మోడీ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శించారు. మహాసభలో జోనల్‌ అధ్యక్ష, కార్యదర్శులు మంజునాథ, నరసింహారావు, డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, ఠాగూర్‌, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ పాల్గన్నారు.