ఎడారిని తలపిస్తున్న డెర్నా నగరం
డెర్నా : భయంకరమైన లిబియా వరదల్లో మృతుల సంఖ్య 20వేలకు పైనే ఉన్నట్లు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. శవాలు ఇంకా కొట్టుకొస్తూనే ఉన్నాయి. మృతదేహాలు రోజుల తరబడి శిధిలాల కింద చిక్కుకునిపోవడం, వరద నీటిలో నానడం వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని అధికార యంత్రాంగం కలవరపడుతోంది. వరద ఉధృతికి పలు డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు, పట్టణాలకు పట్టణాలు కొట్టుకుపోయాయి. పలు అంతస్తుల భవనాలు పేక మేడలా కుప్పకూలాయి. కుటుంబాలకు కుటుంబాలు నిద్రలోనే జల సమాధి అయ్యాయి. మృతుల సంఖ్య అంచనాలకు అందడం లేదు. మృతుల సంఖ్య కన్నా గల్లంతైన వారి సంఖ్య అనేక రెట్లు అధికం నగరంలో మృతుల సంఖ్య 18వేల నుంచి 20వేల వరకు వుండొచ్చునని డెర్నా నగర మేయర్ అబ్దుల్లామీనన్ తెలిపారు. మృత దేహాలను స్వాధీనం చేసుకోవడానికి నిపుణుల బృందాలు అవసరమవుతున్నాయని చెప్పారు. రాత్రికి రాత్రి జరగాల్సిన అనర్ధమంతా జరిగిపోయిందని, వేలాదిమంది సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు భావించాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పుడూ జన సమ్మర్ధంతో కిటకిటలాడే డెర్నా నగరం ఎడారిని తలపిస్తోంది. బీచ్ శవాలతో బీభత్సంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా బట్టలు, ఆట బమ్మలు, ఫర్నీచర్, చెప్పులు, ఇతర వస్తువులతో చిందరవందరగా వుంది. వీధుల్లో బురద పెద్దయెత్తున పేరుకుపోయింది. కూకటివేళ్లతో సహా కూలిపోయిన చెట్లు, బురదలో చిక్కుకుపోయిన కార్ల గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు.
- వెల్లువెత్తుతున్న సంఘీభావం
జల ప్రళయాన్ని ఎదుర్కొంటున్న లిబియాకు అంతర్జాతీయంగా సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఈజిప్ట్, ట్యునీషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, కతార్‌ల నుండి సహాయక బృందాలు లిబియా చేరుకుని సహాయ చర్యల్లో నిమగమయ్యాయి. క్షేత్ర స్థాయిలో రెండు ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి అవసరమైన సామాగ్రిని టర్కీ పంపింది. ఇటలీ మూడు విమానాలతో సరఫరాలను, సిబ్బందిని పంపింది. మరో రెండు నౌకలు కూడా సామాగ్రితో వచ్చినా పూర్తిగా శిధిలాల గుట్టగా మారిన డెర్నా ఓడరేవు ఉపయోగించడానికి పనికి రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. లిబియాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. 2011లో గడాఫీ ప్రభుత్వాన్ని కుట్రతో అమెరికా కూల్చివేసిన తర్వాత దేశవ్యాప్తంగా పట్టు కలిగిన ప్రభుత్వమేదీ లేదు. లిబియా ఉత్తర ప్రాంతంలో అమెరికా తొత్తు ప్రభుత్వం అధీనంలో ఉండగా, దక్షిణ ప్రాంతం తిరుగుబాటు దారుల చేతుల్లో ఉంది.