Oct 07,2023 11:58

సిక్కిం : సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 53కి చేరింది. చనిపోయిన వారిలో ఏడుగురు జవాన్లు కూడా ఉన్నారు. ఇక పొరుగున్న ఉన్న పశ్చిమబెంగాల్‌లోని తీస్తా నదిలో ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమైనట్లు శుక్రవారం విడుదల చేసిన సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (ఎస్‌ఎస్‌డిఎంఎ) నివేదిక పేర్కొంది. ఇంకా 142 మంది గల్లంతయ్యారని ఈ నివేదిక తెలిపింది. ఈ వరదల కారణంగా 2,413 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారని, సుమారు 1203 ఇళ్లు దెబ్బతిన్నాయని ఈ ఎస్‌ఎస్‌డిఎంఎ నివేదిక తెలిపింది. ఈ వరదల వల్ల సుమారు 25,065 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 6875 మంది 22 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని సిక్కిం విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. వరదల కారణంగా 13 వంతెనలు వరదలో కొట్టుకుపోయాయని, ఉత్తర సిక్కింలో కమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడినట్లు ఎస్‌ఎస్‌డిఎంఎ నివేదిక తెలిపింది.
సీఎం ఉన్నతస్థాయి సమావేశం
వదరల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ శుక్రవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సహాయక చర్యలు, పునరుద్దరణ పనులపై సమీక్షించారు. చుంగ్‌తంగ్‌ వరకు రోడ్డు కనెక్టివిటీని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. నాగా నుంచి టూంగ్‌ వరకు వీలైనంత త్వరగా రహదారిని నిర్మించాలని పేర్కొన్నారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు.