Oct 05,2023 11:22

గ్యాంగ్‌టక్‌  :  మెరుపు వరదలతో సిక్కిం  అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి  కురవడంతో .. లోచెన్‌ లోయలోని తీస్తా నదికి భారీగా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 14 మంది మరణించగా, 102 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 23 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు 26 మంది గాయపడ్డారు.  2,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరలించారు. 11 వంతెనలు కొట్టుకుపోయాయని, 22,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్మీ మరియు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) నేతృత్వంలో ప్రభావిత ప్రాంతాల్లో సహాయక  చర్యలు చేపడుతున్నారు.  భారత వైమానిక దళం కూడా సిద్ధంగా ఉందని అన్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 3,000 మంది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు సిక్కిం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విబి పాఠక్‌ తెలిపారు.  చుంగ్‌థాంగ్‌లోని తీస్తా స్టేజ్‌ 111 ఆనకట్టలో పనిచేస్తున్న పలువురు కార్మికులు కూడా ఆనకట్ట సొరంగాల్లోనే చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. ఆకస్మిక వరదలతో తీస్తా నది బేసిన్‌లోని దిక్చు, సింగ్తమ్‌, రంగ్పో పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు నీటమునిగాయి. పశ్చిమబెంగాల్‌, సిక్కింను కలిపే 10వ నంబర్‌ జాతీయ రహదారి చాలా చోట్ల దెబ్బతింది. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీస్తా సిక్కిం నుండి బెంగాల్‌కు దిగువకు ప్రవహిస్తున్నందున రాష్ట్ర సరిహద్దు సమీపంలోని ఇళ్లలోకి బురద చేరింది. బెంగాల్ లోని కాలింపాంగ్ జిల్లాలో పలు    చెట్లు నేల కూలాయి. నివాసాలు కొట్టుకుపోయాయి.