గ్యాంగ్‌టక్ : సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల మృతుల సంఖ్య 40కి చేరింది. తీస్తా నది నుండి 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మంగళవారం అర్థరాత్రి కురిసిన కుంభవృష్టితో తీస్తానదికి వరద పెరిగిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది సహా పలువురు గల్లంతయ్యారు. ఆర్మీ క్యాంప్‌లోని పేలుడు పదార్థాలు, ఆయుధాలు కొట్టుకుపోయినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.
మరో గ్లాసియర్ (హిమానీ నది) పేలుడుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. లాచెన్ సమీపంలోని షాకో చో సరస్సు పొంగే అవకాశం ఉండటంతో.. అధికారులు స్థానికులను ఖాళీ చేయిస్తున్నారు. అలాగే పర్యాటకులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. లాచెన్ మరియు లాచెంగ్‌లలో సుమారు 3,000 మంది ప్రజలు చిక్కుకుపోయారు. మోటార్ సైకిళ్లపై అక్కడికి వెళ్లిన 3,150 మంది కూడా వరదల కారణంగా చిక్కుకుపోయారు. ఆర్మీ, వైమానిక హెలికాఫ్టర్‌లతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు సిక్కిం చీఫ్ సెక్రటరీ విజరు భూషణ్ పాఠక్ తెలిపారు.