Oct 04,2023 22:02

23 మంది సైనికులతో సహా 49 మంది గల్లంతు
గ్యాంగ్‌టక్‌: ఉత్తర సిక్కింలో మేఘ విస్ఫోటనంతో వర్షలు కుండపోతగా కురియడంతో తీస్తా నదికి ఆకస్మిక వరదలచ్చి ఎనిమిది మంది చనిపోయారు. 23 మంది సైనికులతో సహా 49 మంది గల్లంతయ్యారు. ముగ్గురు ఉత్తర బెంగాల్‌లో చనిపోగా, గొలిటార్‌, సింగ్జామ్‌ ప్రాంతంలో అయిదు మృత దేహాలు స్వాధీనం చేసుకున్నట్లు గాంగ్టక్‌ సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ మహేంద్ర ఛెత్రి తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు వెంబడి ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టికి లాచెన్‌ లోయలో తీస్తా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. నీటి మట్టం ఒక్కసారిగా 25 అడుగుల మేర పెరగడంతో ఆ సమీప ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ వరదల ధాటికి లాచెన్‌ లోయలోని ఆర్మీ పోస్టులు, సింగ్తమ్‌ ప్రాంతంలోని ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయని,. అందులోని 23 మంది సిబ్బంది గల్లంతయ్యారని ఈస్ట్రన్‌ కమాండ్‌ బుధవారం ఉందయం ప్రకటనలో వెల్లడించింది. 41 వాహనాలు నీటమునిగినట్లు తెలిపింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వరదలు సంభవించిన ప్రాంతంలో కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌కు అంతరాయమేర్పడడంతో సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్‌ ఫూట్‌ బ్రిడ్జ్‌ కుప్పకూలింది. బంగ్లాదేశ్‌లో ప్రవేశించే ముందు తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో ప్రవహిస్తుంది.