
- వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు
- సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
- ఈ నెల 27 న కలెక్టర్ వద్ద ధర్నాకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం
ప్రజాశక్తి-భీమవరం : వివిధ రకాల చార్జీల పేరుతో విద్యుత్ బారాల మోపి సామాన్య ప్రజానీకం నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల విధానాలకు వ్యతిరేకంగా మరో విద్యుత్ ఉద్యమానికి సన్నద్ధం కావాలని వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు, విద్యుత్ చార్జీలు పెంపు , సర్దుబాటు , ట్రూ అప్ చార్జీలు పెంపు సరైనది కాదని వీటికి నిరసిస్తూ ఈనెల 27న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. స్థానిక మెంటేవారితోటలోని సుందరయ్య భవనంలో విద్యుత్ చార్జీల పెంపు,-స్మార్టు మీటర్లకు నిరసనగ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ , సిపిఎం, ఫార్వర్డు బ్లాకు, ఎంసిపిఐ (యు) నాయకులు హాజరయ్యారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అధ్యక్షత వహించి మాట్లాడరు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిందని ఆరోపించారు . ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, స్లాబులు కుదించటంతో విద్యుత్ వినియోగదారులపై విపరీతమైన భారాలు పడుతున్నాయన్నారు. ఒక పక్క పెరిగిన విద్యుత్ చార్జీలతో సతమతమవుతుంటే ఇళ్లకు, షాపులకు ప్రిపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి కనెక్షన్‌కు రూ. 13 వేలు భారం వినియోదారులపై పడుతుందన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలవల్ల లఘు,కుటీర పరిశ్రమలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. వ్యాపారాలు దెబ్బతిని, ఉపాధి తగ్గుతోందన్నారు. డిస్కమ్స్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిపై వడ్డీ కూడా ప్రజల నెత్తిన రుద్దుతున్నారన్నారు. కేంద్రంలో మోడి ఏది చెబితే ఆ విధానాన్ని రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డి అమలు చేయడం దారుణమన్నారు.. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ప్రజలపై ఎటువంటి భారాలు మోపబోమని ఎన్నికల్లో వాగ్ధానం చేసి గద్దెనెక్కిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తూ ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నారన్నారు. ట్రూ ఆప్ చార్జీల పేరుతో ప్రజల నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు.జోన్లక్రింద విభజించి ఒక్కొ టైంకి ఒక్కో రేటు వసూలు చేయడానికి రంగం సిద్దం చేయడం దారుణమని అన్నారు. వీటిని తక్షణమే ఉపసంహరించకపోతే ప్రభుత్వానికి రానున్న కాలంలో ప్రజలను ఏకంచేసి తగిన గుణపాఠం చెప్తామన్నారు. గత బషీర్ బాగ్ ఉద్యమం తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఫార్వర్డుబ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి మాట్లాడుతూ విపరీతంగ పెంచిన విద్యుత్ చార్జీలు,స్మార్ట్‌మీటర్ల నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ నెల 27 వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని రౌండుటేబుల్ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ధర్నాలో .ప్రజలు పాల్గొని తమ నిరసన తెలియజేయాలని కోరింది. ఈ సమావేశoలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు జె.ఎన్.వి గోపాలన్, బి.వాసుదేవరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు నాయకులు ఎం.సీతారాం ప్రసాద్, ఫార్వర్డు బ్లాకు నాయకులు దండు శ్రీనివాసరాజు యంసిపిఐ(యు )నాయకులు చంటి పాల్గొన్నారు.