ప్రజాశక్తి-రామచంద్రపురం : పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎమ్-ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ నాయకులు పి. రాము, సీపీఎం. నాయకులు నూకల.బలరాం, సీపీఐ ఎమ్-ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు వి.భీమశంకరo, రాజు మాట్లాడుతూ వేసవి తలపించే గృహ విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయని, ప్రతినెల చార్జీలు విపరీతంగా పెంచి కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు సామాన్యుల పై పెనుభారము మోపుతున్నారనీ తక్షణమే పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 2000 సంవత్సరంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడి ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ప్రజలు తిరస్కరించిన ప్రపంచ బ్యాంకుసంస్కరణలను నేడు కేంద్ర ప్రభుత్వం పేరుతో రాష్ట్ర సర్కార్ అమలు చేస్తోందనీ భవిష్యత్తులో విద్యుత్ రంగం పూర్తిగా కార్పొరేట్ల కబంధహస్తాల్లోకి వెళుతున్నదని ఆరోపించారు. చార్జీలు మరింతగా భారం కానున్నాయని అన్నారు.తక్షణం విద్యుత్ భారాలు తగ్గించాలని. స్మార్ట్ మీటర్లు ఆపాలని, ప్రమాదకరమైన విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని. విద్యుత్ చట్ట సవరణ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ చార్జీల భారం తగ్గింపు కొరకు, ప్రమాదకరమైన కార్పొరేటీకరణ విధానాలు రద్దు కోసం ఉద్యమించాలని కోరారు. ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు ఇతర భారాలు రద్దు చేయాలి. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలి.స్మార్ట్ మీటర్ల బిగింపునిలిపివేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తునుకొనసాగించాలి. ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు రాయితీని అందించాలి.200 యూనిట్లు లోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలి.విద్యుత్ సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎమ్-ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బి. సిద్దూ, అంబటి కృష్ణ, రాజా రెడ్డి, సీపీఐ నాయకులు వై. నాగమణి, కృష్ణ, బాబ్జి, ఏ ఐ టీ యూ సీ జి. రాజు, టీ. శ్రీనివాస్ ,సీపీఐ ఎమ్-ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు గణేశ్, సాయిబాబాతదితరులు పాల్గొన్నారు.










