కరోనా కారణంగా తలెత్తిన సమస్యలు ఒక పక్క... తమ దేశాలు ఎగుమతి చేసే ముడిసరుకుల ధరల పతనం ఇంకో పక్క...ఈ దేశాలకు సవాలుగా ఉన్నాయి. ప్రజల ఆకలి తీర్చాలంటే ఈ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలకు ధనం కావాలి. దానిని దేశంలోని పెట్టుబడిదారీ వర్గం అయినా సమకూర్చాలి. లేదా తమ దేశాలు ఎగుమతి చేసే ముడిపదార్ధాల ధరలైనా పెరగాలి. అంటే తమ దేశంలోని బూర్జువా వర్గంతోనైనా ఈ ప్రభుత్వాలు తలపడాలి. లేదా అమెరికన్ సామ్రాజ్యవాదంతోనైనా తలపడాలి. తమ తమ దేశాల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి నిరాకరించే దేశీయ, విదేశీ పెట్టుబడిదారీ వర్గంతో ఈ ప్రభుత్వాలు ఏ మేరకు, ఏ విధంగా తలపడి నెగ్గుకురాగలవన్నదే ముందున్న సవాలు.
ఆగస్టు 7వ తేదీన కొలంబియా లో గుస్తావో పెట్రో అనే నూతన అధ్యక్షుడు, ఫ్రాన్సిస్ మార్క్వెజ్ అనే నూతన ఉపాధ్యక్షురాలు అధికారాన్ని చేపట్టనున్నారు. వీరిద్దరూ కొలంబియా లోని వామపక్ష ఉద్యమాలలో కాకలు తీరిన యోధులు. 1810లో కొలంబియా కి స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత ఏర్పడనున్న మొట్టమొదటి వామపక్ష ప్రభుత్వం ఇదే. అక్కడికి రెండు నెలల తర్వాత, అక్టోబర్ 2న బ్రెజిల్ దేశ ప్రజానీకం దేశాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల మొదటి రౌండ్ లో పాల్గొంటారు. గతంలో బ్రెజిల్ అధ్యక్షుడిగా వ్యవహరించిన వామపక్ష నేత లూలా ప్రస్తుత అధ్యక్షుడు బోల్సనారో మీద పోటీ చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం లూలా మితవాద బోల్సనారో కన్నా ఆధిక్యంలో ఉన్నాడు. బహుశా రెండో రౌండ్ అవసరం లేకుండానే, మొదటి రౌండ్ లోనే కావలసిన ఆధిక్యత లూలాకు రావచ్చునని పలువురు భావిస్తున్నారు. అవసరం పడితే, రెండో రౌండ్ ఎన్నికలు అక్టోబర్ 30న జరుగుతాయి. బ్రెజిల్ లో కూడా వామపక్షాలు విజయం సాధిస్తే, మొత్తం లాటిన్ అమెరికా లోని 20 దేశాలకు గాను సగం పైగా దేశాలలో వామపక్ష ప్రభుత్వాలు గాని, మధ్యేవాద-వామపక్ష ప్రభుత్వాలు గాని ఏర్పడినట్టు అవుతుంది.
ఐతే, ఇప్పుడు వామపక్ష శక్తులు లాటిన్ అమెరికాలో కనపరుస్తున్న ఆధిక్య ధోరణిని 2000 దశకంలో తలెత్తిన ''గులాబీ వెల్లువ'' (పింక్ టైడ్)తో పోల్చలేము. ఆ కాలంలో వెనిజులాలో హ్యూగో చావెజ్ నాయకత్వంలో వామపక్ష శక్తులు విజయం సాధించడంతో ఆ వెల్లువ ప్రారంభమైంది. ఆ సమయంలో అమెరికా తన దృష్టినంతా మధ్య ప్రాచ్యం మీద కేంద్రీకరించింది. లాటిన్ అమెరికా దేశాల్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. అప్పటివరకూ అధికారాన్ని చెలాయించిన మిలిటరీ పాలకులమీద, నయా ఉదారవాద పాలకులమీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ''బొలివేరియనిజం'' అనే పేరుతో చావెజ్ ఆనాడు పశ్చిమార్ధ భూగోళంలోని దక్షిణ భూభాగంలో లోతుగా పాతుకుపోయివున్న సామాజిక సమస్యల పరిష్కారాన్ని, ప్రాంతీయ సమైక్యతను జోడించి ముందుకు తెచ్చాడు. పశ్చిమ భూగోళంలోని ఉత్తర భాగంలో ఉన్న సంపన్న పెట్టుబడిదారీ దేశాల మార్కెట్ల మీద ఆధారపడి వుండే పరిస్థితిని అధిగమించనంతకాలం, అమెరికన్ సైనిక బలగాల ఆధిపత్యం ఆ ప్రాంతంలో కొనసాగుతున్నంతకాలం తమ ప్రాంతపు మౌలిక సమస్యలను, ఆకలిని అధిగమించడం సాధ్యం కాదు అన్న విషయాన్ని ఆ ప్రాంతంలోని ప్రజలు స్పష్టంగా గుర్తించారు. వెనిజులా నుండి అర్జెంటీనా వరకూ సాగిన బొలివేరియన్ ప్రయోగాలను సామ్రాజ్యవాద వ్యతిరేకత బలంగా ప్రభావితం చేసింది.
2000 దశకం నాటి పరిస్థితుల కన్నా నేడు మరింత అనిశ్చిత పరిస్థితులు నెలకొనివున్నాయి. ప్రస్తుతం వామపక్ష శక్తులు సాధించిన ఎన్నికల విజయాలను ఈ నేపథ్యంలో చూడాలి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ 20 ఏళ్ళ క్రితంతో పోల్చితే నేడు మరింత బలహీన పడింది. అందువలన అమెరికన్ సామ్రాజ్యవాదం అప్పటికన్నా ఎక్కువ అశక్తతతో ఉంది. చైనా, రష్యా లను ఎలాగైనా బలహీనపరచాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడం, వాషింగ్టన్ ఆదేశాలను రోజురోజుకూ బేఖాతరు చేసే ధోరణి ప్రపంచంలో పెరగడం మనం చూస్తున్నాం. ఈ పరిణామాల ఫలితంగా లాటిన్ అమెరికాలో ఒక కొత్త ఊపు మనకు కనిపిస్తోంది. మెక్సికో అధ్యక్షుడు అండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ విదేశీ వ్యవహారాల విషయంలో ప్రదర్శించిన స్వతంత్ర వైఖరి వంటిదే ఇప్పుడు దక్షిణాఫ్రికా నుండి ఇండోనేషియా వరకూ పలు దేశాలలో కానవస్తోంది. ఐతే, ఇదే సమయంలో ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణ సంక్షోభం, రుణ లభ్యత సమస్య, వాషింగ్టన్ నుండి వస్తున్న అడ్డగోలు బెదిరింపులు - వీటి వలన పలు దేశాలు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ముఖాముఖి సవాలు చేయడానికి సిద్ధపడడం లేదు. చైనా, రష్యా దేశాలపై అమెరికా వాణిజ్య ఆంక్షల రూపంలో సాగిస్తున్న ప్రచ్ఛన్న యుద్ధంలో పలు లాటిన్ అమెరికా దేశాలు చిక్కుకుపోయాయి. అందుచేత అవి ఆ యుద్ధంలో ఎటూ మొగ్గు చూపకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునేవరకూ వేచివుండే వైఖరిని చేపట్టాయి. ఈ లోపు తమ దేశాల ప్రజలకు మౌలికమైన సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందువలన ఇప్పుడు మనం చూస్తున్నది బొలివేరియన్ విప్లవం యొక్క రెండవ దశ మాత్రం కాదు.
బ్రెజిల్, కొలంబియా దేశాలు ప్రస్తుతం సాగుతున్న వెల్లువకు మంచి ఉదాహరణలు. ఇదే ధోరణి చిలీ, మెక్సికో దేశాలలో కూడా కానవస్తున్నప్పటికీ, అక్కడి ఆర్థిక వ్యవస్థలు అమెరికా దన్నుతో వ్యవహరించే పాలక వర్గాల చేతుల్లో చిక్కుకుని వున్నాయి. చిలీ లోని మధ్యేవాద-వామపక్ష ప్రభుత్వం గేబ్రియల్ బోరిక్ నాయకత్వంలో ఉంది. దేశంలోని రాగి గనులను జాతీయం చేస్తామని ఆ ప్రభుత్వం ప్రకటించింది. కాని అక్కడ బలంగా ఉన్న బూర్జువా వర్గం ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వేయనివ్వలేదు (1972లో అప్పటి చిలీ అధ్యక్షుడిగా ఉన్న సాల్వడార్ అలెండీ రాగి గనులను జాతీయం చేశారు. ఆ మరుసటి ఏడాదే ఆ ప్రభుత్వాన్ని కుట్రతో కూలదోశారు. అది జరిగిన 50వ సంవత్సరంలో మనం ఉన్నాం). అక్కడి పాత పెట్టుబడిదారీ వర్గం ఆ కాలపు సామాజిక ఆధిపత్యాన్నే ఇంకా కొనసాగిస్తోంది. దానికి శక్తివంతమైన అమెరికన్ సామ్రాజ్యవాదం పూర్తి దన్ను ఇస్తోంది. పైగా ఇప్పుడు సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారపు పెట్టుబడిదారీ వర్గం దానికి తోడైంది. కొలంబియా లో పెట్రో ప్రభుత్వం ఇంకా బాధ్యతలు చేపట్టనేలేదు. కాని కొత్త ప్రభుత్వం ఎటువంటి మౌలిక సంస్కరణలూ చేపట్టకూడదని అక్కడి సైన్యం ముందే హెచ్చరించింది (పెట్రో ప్రమాణ స్వీకారం నాడు భాగస్వామి కాకూడదన్న పంతంతో సైనిక దళాల ముఖ్యాధికారి జనరల్ జపాటీరో జులై నెలాఖర్లో రాజీనామా చేసేశాడు. ఇదీ అక్కడి పాలక వర్గాల వైఖరి). మిలిటరీ నియంతృత్వ పాలనలో అనుసరించిన 'పొదుపు చర్యల' పర్యవసానంగా, అణచివేత విధానాల ఫలితంగా, లాటిన్ అమెరికా దేశాల్లో రైతాంగం, కార్మికవర్గం సాపేక్షంగా చెదురుమదురుగా అయిపోయారు. వారు సంఘటితంగా లేరు. ఒక మౌలికమైన మార్పుల కోసం వత్తిడి చేయగల పరిస్థితిలో ఆ దేశాల్లోని కార్మికోద్యమాలు గాని, రైతాంగ ఉద్యమాలు గాని లేవు. ఉదాహరణకి పెరూ నే తీసుకోండి. అక్కడ వామపక్షవాది అయిన పెడ్రో కాస్టిల్లో అధ్యక్షుడిగా విజయం సాధించాడు. కాని అతను చేసిన వాగ్దానాలకు కట్టుబడి వ్యవహరించేలా వత్తిడి చేయడం అక్కడి సామాజిక, రాజకీయ ఉద్యమాలకు సాధ్యం కావడం లేదు. అర్జెంటినా లో ప్రభుత్వం మళ్ళీ ఐఎంఎఫ్ పంచన చేరడంతో అక్కడ సంక్షోభం తిరిగి తలెత్తింది. ఐతే అక్కడున్నది వామపక్ష ప్రభుత్వమే. కాబట్టి లాటిన్ అమెరికా దేశాలలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు సోషల్ డెమాక్రటిక్ స్వభావం గల మార్పులుగానే చూడాలి తప్ప సోషలిస్టు స్వభావంగల మార్పులుగా భావించలేము.
మన్రో సిద్ధాంతం - క్యూబా విప్లవం
రెండు వందల సంవత్సరాల క్రితం కొరబోబో యుద్ధంలో సైమన్ బొలివర్ నాయకత్వం లోని సైన్యాలు స్పెయిన్ దేశపు సామ్రాజ్యవాదుల సైన్యాలను ఓడించాయి. దాంతో స్పానిష్ సామ్రాజ్యవాదుల పెత్తనం ముగిసింది. లాటిన్ అమెరికా దేశాల స్వాతంత్య్రానికి బాటలు పడ్డాయి. ఐతే, ఆ మరుసటి సంవత్సరం లోనే, 1823లో, అమెరికన్ ప్రభుత్వం మన్రో సిద్ధాంతాన్ని ప్రకటించింది. అమెరికా ఖండంలో జోక్యం చేసుకునే హక్కు యూరప్ దేశాలకు లేదని ఆ సిద్ధాంతం చెప్తుంది. ఐతే, అదే సమయంలో, అమెరికా ఖండాల్లో (ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా) ఎప్పుడైనా, ఎక్కడైనా అవసరమని తనకు తోచినప్పుడు రాజకీయంగా గాని, సైనిక పరంగా గాని తాను జోక్యం చేసుకోవచ్చునన్నది యు.ఎస.్‌ఎ. తనకు తాను అధికారాన్ని ఆపాదించుకున్నది. మన్రో సిద్ధాంతం అమెరికన్ సామ్రాజ్యవాదపు ఆధిపత్యాన్ని సమర్థించుకునే సిద్ధాంతం తప్ప వేరొకటి కాదు. ఈ సిద్ధాంతం పేరు చెప్పుకుని పలుమార్లు మధ్య అమెరికాలో, కరీబియన్ దీవులలో, దక్షిణ అమెరికా దేశాల్లో యుఎస్‌ఎ జోక్యం చేసుకుంది. ఈ మధ్యనే, 2009లో హోండూరాస్ లో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇప్పుడు క్యూబా, నికరాగ్వా, వెనిజులా దేశాల్లో ప్రభుత్వాలను కూలదోసే కుట్రలకు పాల్పడుతోంది.
మన్రో సిద్ధాంతం యూరోపియన్ సామ్రాజ్యవాద పెత్తనాన్ని అంతం చేయడానికి తీసుకువచ్చింది కాదని, దాని స్థానంలో యుఎస్‌ఎ పెత్తనం చేబట్టి జోక్యం చేసుకోడాన్ని సమర్ధించడానికి తీసుకువచ్చారని స్పష్టం కావడంతో మన్రో సిద్ధాంతానికి వ్యతిరేకత మొదలైంది. నిజానికి, 1833లో అర్జెంటినా నుండి మాల్వినాస్ దీవులను బ్రిటన్ బలిమిన స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా నోరెత్తలేదు. లాటిన్ అమెరికా దేశాల్లో యూరోపియన్ గుత్త పెట్టుబడుల ప్రవేశానికి అమెరికా ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. 1846-48 మధ్య అమెరికా మెక్సికోలో జోక్యం చేసుకుని ఆ దేశపు భూభాగంలో మూడవ వంతు ఆక్రమించుకుంది. మెక్సికో సార్వభౌమాధి కారాన్ని అతిక్రమించింది. ఈ రెండు ఘటనలూ మన్రో సిద్ధాంతపు అసలు స్వభావం ఏమిటో ఆనాడే తేటతెల్లం చేశాయి. 1948లో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ ఏర్పడింది. దానికి మన్రో సిద్ధాంతం ప్రాతిపదిక అని ప్రకటించారు. ఫైడల్ కాస్ట్రో ''ఇది వలసాధిపత్య వేదిక'' అని అభివర్ణించారు.
1959లో జరిగిన క్యూబన్ విప్లవం మన్రో సిద్ధాంతాన్ని నేరుగా సవాలు చేసింది. అమెరికా పెత్తనాన్ని ఎదిరించి దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని నిలబెట్టింది. ప్రజలు సామాజికంగా అభివృద్ధి చెంది గౌరవ ప్రదంగా జీవించే హక్కును తిరిగి ప్రతిష్టించింది. క్యూబాలో సాధించిన సోషలిస్టు విప్లవం ఇచ్చిన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికన్ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్ల వెల్లువలు వరుసగా తలెత్తాయి. అత్యంత క్రూరమైన హింసాకాండకు తెగబడి, సైనిక తిరుగుబాట్లను ప్రోత్సహించి అమెరికా ఈ తిరుగుబాట్లను అణచివేసింది. దీనికి ''ఆపరేషన్ కాండర్'' అని పేరు. 1964లో బ్రెజిల్ తో మొదలై 1976లో అర్జెంటినా వరకు ఈ కుట్రలు జరిగాయి. దాంతో క్యూబా చూపించిన ప్రత్యామ్నాయం వెంట తక్కిన లాటిన్ అమెరికా దేశాల అడుగులు పడలేదు. కాని, అమెరికా ఎంతగా దిగ్బంధం చేసినా, అది క్యూబాలో సోషలిజం ముందుకు సాగిపోడాన్ని అడ్డుకోలేకపోయింది. క్యూబా అంతర్జాతీయంగా సంబంధాలను కూడా బలపరుచుకోగలిగింది. ఆ తర్వాత 1979లో తిరుగుబాట్ల రెండో వెల్లువ తలెత్తింది. నికరాగ్వా తో మొదలై, గ్రెనడా వరకు ఈ వెల్లువ ప్రభావం చూపింది. కాని, అమెరికన్ సామ్రాజ్యవాదం మాదకద్రవ్యాల వ్యాపారాలు సాగించే సాయుధ ఉగ్రవాద ముఠాలతో కుమ్మక్కై ఆ రెండో వెల్లువను అణచివేసింది. 1999లో వెనిజులాలో చావెజ్ గెలుపుతో మూడో వెల్లువ తలెత్తింది. దాన్నే ' గులాబీ వెల్లువ' అని అంటాం. ముడి సరుకుల రేట్లను ఏకపక్షంగా తగ్గించడం, వెనిజులా దేశపు బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేయడం వంటి తప్పుడు వాణిజ్య విధానాలను అనుసరించడం ద్వారా అమెరికా ఈ గులాబీ వెల్లువను దెబ్బ తీయడానికి పూనుకుంది. ఆ యా లాటిన్ అమెరికన్ దేశాల్లో పెట్టుబడిదారీ వర్గాల పట్టును సవాలు చేయగల సామాజిక, రాజకీయ ఉద్యమాల నిర్మాణం లేనందువలన ఈ తిరుగుబాట్లు కూడా విజయం సాధించలేకపోయాయి. ఐతే మరోవైపు క్యూబా ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది.
ప్రస్తుతం నాలుగో వెల్లువ సాగుతోంది. 1959లో క్యూబా విప్లవం విజయం సాధించిన తర్వాత వచ్చిన నాలుగో వెల్లువ ఇది. ఇది ప్రాధాన్యత గలిగినదే అయినా, దానిని అతిగా అంచనా వేయకూడదు. ఈ వెల్లువలో అధికారంలోకి వచ్చిన వామపక్ష ప్రభుత్వం ఏదైనా, మధ్యేవాద-వామపక్ష ప్రభుత్వమైనా, తమ తమ దేశాల్లో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వుంటుంది. కరోనా కారణంగా తలెత్తిన సమస్యలు ఒక పక్క...తమ దేశాలు ఎగుమతి చేసే ముడిసరుకుల ధరల పతనం ఇంకో పక్క...ఈ దేశాలకు సవాలుగా ఉన్నాయి. ప్రజల ఆకలి తీర్చాలంటే ఈ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలకు ధనం కావాలి. దానిని దేశంలోని పెట్టుబడిదారీ వర్గం అయినా సమకూర్చాలి. లేదా తమ దేశాలు ఎగుమతి చేసే ముడిపదార్ధాల ధరలైనా పెరగాలి. అంటే తమ దేశంలోని బూర్జువా వర్గంతోనైనా ఈ ప్రభుత్వాలు తలపడాలి. లేదా అమెరికన్ సామ్రాజ్యవాదంతోనైనా తలపడాలి. తమ తమ దేశాల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి నిరాకరించే దేశీయ, విదేశీ పెట్టుబడిదారీ వర్గంతో ఈ ప్రభుత్వాలు ఏ మేరకు, ఏ విధంగా తలపడి నెగ్గుకురాగలవన్నదే ముందున్న సవాలు.
విజయ్ ప్రసాద్
( స్వేచ్ఛానుసరణ ) ( వ్యాసకర్త 'లెఫ్ట్ వర్డ్ బుక్స్' చీఫ్ ఎడిటర్ )