ప్రజాశక్తి-ఘంటసాల (కృష్ణా) : బిజెపిని సాగనంపుదాం ... దేశాన్ని కాపాడుకుందాం ... నినాదంతో సిపిఐ, సిపిఎం ల ఆధ్వర్యంలో ఈనెల 30 వరకు నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. శనివారం చల్లపల్లి మండలంలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో సమావేశమైన నేతలు గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... ఏప్రిల్ 27న చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాలలో 28న అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలంలో ప్రచార భేరి సాగుతుందని అన్నారు. ఆయా తారీఖులలో ఆయా మండలాలలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ప్రచార భేరిలో సమిష్టిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యద్దనపూడి మధుసూదన్ రావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్, సిపిఎం నాయకులు వాకా రామచంద్రరావు, గొల్ల సాంబశివరావు, దోనే సహదేవుడు, మేడేపల్లి వెంకటేశ్వరరావు, బండి ఆదిశేషు, కోలాబత్తిన మోహన్ రావు, కుంపటి బాబురావు, సిపిఐ నాయకులు పెనుమత్స రాజారత్నం, కూరపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.