Oct 31,2023 11:06

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
సామాజిక భద్రత కల్పించాలి
రెగ్యులరైజేషన్‌ చేయాలి
సంఘర్ష్‌ ర్యాలీలో కదం తొక్కిన ఆశాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 
ఉమ్మడి పోరాటాలకు సిద్ధం కావాలని ఆశా వర్కర్స్‌, ఫెసిలిటేటర్లకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ పిలుపునిచ్చారు. ఆశాలను రెగ్యులరైజేషన్‌, కనీస వేతనం నెలకు రూ.26 వేలు, ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లకు సామాజిక భద్రత, పెన్షన్‌, అందరికీ ఆరోగ్యం డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్స్‌ అండ్‌ ఫెసిలిటేటర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సోమవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద ఆశా సంఘర్ష్‌ ర్యాలీ జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఆశాలు దేశ రాజధాని హస్తినలో కదంతొక్కారు. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో డిమాండ్లతో కూడిన ప్లకార్డులను చేబూని గర్జించారు. 'మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. 2023 నవంబరు 26 నుంచి 28 వరకు రాష్ట్రాల రాజధానుల్లో జరిగే మజ్దూర్‌ కిసాన్‌ మహాపదవ్‌లో భాగస్వామ్యం కావాలి' అంటూ సంఘర్ష్‌ ర్యాలీ పిలుపు ఇచ్చింది.

'ఆశా సంఘర్ష్‌ ర్యాలీ'ని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన పోరాటాలు చేస్తున్న ఆశా వర్కర్లను అభినందిస్తూ, జాతీయ స్థాయిలో పోరాటాలను ఉధృతం చేయాలని, కార్పొరేట్‌, మత సంబంధమైన ఈ ప్రభుత్వ దేశ వ్యతిరేక విధానాలను మార్చేందుకు ఉమ్మడి పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ సర్కారు.. కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలను ఇస్తుందని విమర్శించారు. స్కీమ్‌ వర్కర్లకు న్యాయంగా అందాల్సిన సౌకర్యాలు అందడం లేదని అన్నారు. మరోవైపు స్కీమ్‌లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. కిందస్థాయి సేవల్లో ఆశాలు కీలకపాత్ర పోషిస్తున్నారని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని అన్నారు. వారి హక్కులను కాలరాసే విధానాల రూపకల్పన, అమలు చేస్తున్నారని విమర్శించారు. వీటినన్నిటినీ తిప్పికొట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఎడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు పిపి ప్రేమ అధ్యక్షోపన్యాసం చేశారు. ఆశాలను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఆశాలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, కానీ వాళ్లు ప్రయోజనాల కల్పనలో వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. ఎడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మధుమిత బందోపాధ్యాయ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సమాఖ్య చేసిన పోరాటాలు, సాధించిన డిమాండ్ల సమస్యలు వివరించారు. పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ ర్యాలీలో ప్రజా సంఘాల నాయకులు పి కృష్ణప్రసాద్‌ (ఎఐకెఎస్‌), బి వెంకట్‌ (ఎఐఎడబ్ల్యుయు), హన్నన్‌ మొల్లా (ఎస్‌కెఎం-ఎఐకెఎస్‌), సవిత (ఐద్వా) ప్రసంగించారు. ఆశాల పోరాటానికి సంఘీభావం, మద్దతు తెలిపారు. జై భగవాన్‌ (ఎండిఎండబ్ల్యూఎఫ్‌ఐ), ఉషారాణి (ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్‌) ఆశా వర్కర్ల పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా స్కీమ్‌ వర్కర్ల ఉద్యమాన్ని, ఐక్యతను క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జాతీయ కార్యదర్శి ఎఆర్‌ సింధు స్కీమ్‌ వర్కర్ల భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. ఎడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సురేఖ ముగింపు ప్రసంగం చేసి కార్యాచరణ ప్రకటించారు.

కోశాధికారి పుష్పా పాటిల్‌, పి జయలక్ష్మి (తెలంగాణ), కె ధనలక్ష్మి (ఆంధ్రప్రదేశ్‌), నోని లిక్సన్‌ (అస్సాం), సుధా సుమన్‌ (బీహార్‌), హసుమతి (గుజరాత్‌), సునీతా భగత్‌ (జమ్ము) దిల్‌షాదా (కశ్మీర్‌), కవితా సోలంకి (మధ్యప్రదేశ్‌), శకుంతల మహాకుత్‌ (ఒడిశా), సీమా (పంజాబ్‌), పుష్పా పాటిల్‌ (మహారాష్ట్ర) శివ దుబే (ఉత్తరాఖండ్‌) సంగీత (ఉత్తరప్రదేశ్‌), సబీనా యాస్మిన్‌ (పశ్చిమ బెంగాల్‌) వివిధ రాష్ట్రాల నాయకులు ర్యాలీలో ప్రసంగించారు. అధ్యక్ష వర్గంలో పిపి ప్రేమ, సునీత, కె ధనలక్ష్మి, సుధా సుమన్‌, ఎటి పద్మనాభన్‌, వీణా గుప్తా, ఆఫీస్‌ బేరర్లు మమత (అస్సాం), ప్రియాంక (మహారాష్ట్ర), మధుజ (బెంగాల్‌), దిలీప్‌ శుక్లా (యుపి), ఎంబి ప్రభావతి, వివి ప్రసన్నకుమారి (కేరళ) ఉన్నారు.
 

భవిష్యత్తు కార్యాచరణ
'మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, 2023 నవంబరు 26-28 తేదీల్లో రాష్ట్ర రాజధానుల్లో జరిగే మజ్దూర్‌, కిసాన్‌ మహాపదవ్‌లో పాల్గనాలని ర్యాలీ పిలుపునిచ్చింది. స్కీమ్‌ వర్కర్ల సదస్సు పిలుపు మేరకు, డిసెంబరు 2023లో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆందోళనకు స్కీమ్‌ వర్కర్లను భారీగా సమీకరించాలి' అని భవిష్యత్తు కార్యచరణను సంఘర్ష్‌ ర్యాలీ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల నుంచి జనసమీకరణ కోటాను అధిగమించి భారీ జనసమీకరణ మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో కలత చెందిన పోలీసులు, పరిపాలన విభాగం సమయానికి ముందే కార్యక్రమాన్ని మూగింపజేసేందుకు ప్రయత్నించారు. దాన్ని ఆశాలు ప్రతిఘటించారు. సంఘర్ష్‌ ర్యాలీలో 17 రాష్ట్రాల నుండి పదివేల మందికి పైగా ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లు పాల్గన్నారు. పంజాబ్‌కు చెందిన రెండు అనుబంధేతర యూనియన్‌లు, యుపి నుంచి ఒక యూనియన్‌ కూడా ర్యాలీలో పాల్గన్నాయి. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల్లో పోరాటాల సందర్భంగా రూపొందించిన పాటలు ఆశాలను ఉత్సాహపరిచాయి.