సిపిఎం అభ్యర్థికి మద్దతుగా అధిర్ రంజన్ చౌదరి ప్రచారం
కోల్‌కతా : దౌర్జన్యానికి పాల్పడుతున్న టిఎంసిని, మతతత్వ బిజెపిని ఓడించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఓటర్లను కోరారు. దూప్‌గురి ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి ఈశ్వర్ చంద్రరారుకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ద్వంద్వ హింసతో బెంగాల్ ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి మతతత్వ రాజకీయాలను, టిఎంసి బీభత్సకాండను ఓడించాలని, సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. టిఎంసి, బిజెపి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాయని ఆయన చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి సలీం మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో బారీ కుంభకోణానికి సంబంధించి టిఎంసి ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశించినా ఇడి, సిబిఐ ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 'ముంబై, బెంగళూరులో ఏం జరుగు తుందో ఎవరికీ తెలియదు.. ధూప్‌గురిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు.. ఇక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. గిరిజనులను మమత తన కాళ్లతో పోలుస్తున్నారని' ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టిఎంసి, బిజెపిలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 5న ఉప ఎన్నిక జరగనుంది.