Nov 06,2023 11:14

ఛత్తీస్‌గఢ్‌ తొలివిడత,
మిజోరంలో రేపే పోలింగ్‌
ఐజ్వాల్‌, రాయ్ పూర్‌ :   
ఈ నెలలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెండో దశకు చేరుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ తొలి దశకు, మిజోరం ఆదివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మంగళవారం మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని 20 స్థానాలకు మొదట విడతలో పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో ఆదివారంతో ప్రచారం ముగిసింది. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాల్లో 8.57లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 174 మంది బరిలో నిలబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్‌ బూత్‌ల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), జోరం పీపుల్స్‌ మూమెంట్‌, కాంగ్రెస్‌ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ మూడు పార్టీలు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపాయి. బిజెపి 23 మందిని, ఆప్‌ నలుగురిని బరిలో నిలిపాయి. మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ తరపున రాహుల్‌ గాంధీ తదితర నేతలు ప్రచారం నిర్వహించారు. అక్టోబర్‌ 30న మిజోరంలో జరగాల్సిన ప్రధానమంత్రి మోడీ పర్యటన ఆకస్మికంగా రద్దయ్యింది. తాజాగా మిజో ఓటర్లను ఉద్దేశించి మోడీ వీడియో సందేశం ఇచ్చారు. 'అద్భుత మిజోరం' కోసం బిజెపి కట్టుబడి ఉందని.. ఇందుకు రాష్ట్ర ప్రజల మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని మోడీ పేర్కొన్నారు.

ఇంటినుంచే 2 వేల మంది ఓటు
మిజోరంలో పోలింగ్‌ విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌తోపాటు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ఇంటినుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. దీంతో 2,059 మంది వృద్ధులు, వికలాంగులు, 8,526 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. మిజోరంలో సాధారణంగా బారీ పోలింగ్‌ నమోదవుతుంటుంది. 2013 ఎన్నికల్లో 80 శాతానికి పైగా, 2018లో 81 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదయింది.
 

ఛత్తీస్‌గఢ్‌లో
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తంగా 90 స్థానాలు ఉండగా.. తొలివిడతలో 20 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది.మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న రెండో విడతలో పోలింగ్‌ నిర్వహించను న్నారు. ప్రస్తుతం జరుగుతోన్న 20 స్థానాల్లో ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తొలి దశ ఓటింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో మొత్తంగా 6,444 మంది ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారని అధికారులు తెలిపారు.