ముంబై : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడోసారి ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో నిరుపమ్ పాల్గొనబోయే ముందు మీడియాతో మాట్లాడారు. 'ఇతర పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ కార్యకర్తలు సహా మేమంతా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాము. అయితే ఈ నిర్ణయం ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కలిసి తీసుకోవాలి' అని అన్నారు.
కాగా, ఈ సమావేశంపై బిజెపి ప్రతినిధి సంబిట్ పాత్ర ఎద్దేవా చేశారు. 'ఇండియా కూటమిలోని ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నవారే. కూటమి భాగస్వాములుగా ఉన్నవారు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు. ఇలాంటి కూటమి ఇంతకుముందు కూడా ఏర్పడింది. అయితే ఎన్నికలు వచ్చే సమయానికి పదవుల కోసం వారిలో వారే కొట్టుకున్నారు. ప్రస్తుత ఇండియా కూటమిలోని పార్టీలు దాదాపు 20 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాయి. ఇదొక స్వార్థపూరిత కూటమి' అని ఆయన అన్నారు. ముంబైలో ఈరోజు జరిగే సమావేశాన్ని 'ఘమాండియా ఘట్‌బంధన్'గా సంబిట్ అభివర్ణించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఓటమి లక్ష్యంగా 'ఇండియా' కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమి సమావేశం మొదట బీహార్, తర్వాత బెంగళూర్‌లో జరగ్గా, మూడో సమావేశం ముంబైలో జరుగుతున్నది.