Oct 25,2023 10:32
  • నవంబరు 19న రెండో దఫా ఓటింగ్‌

బ్యూనస్‌ఎయిర్స్‌ : ఆదివారం జరిగిన అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల్లో మధ్యేవాద వామపక్షవాది సెర్గీ మాస్సా మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆగస్టులో జరిగిన ప్రైమరీస్‌ ఎన్నికల్లో మితవాద కూటమిదే విజయం ఖాయమని అంతర్జాతీయ మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో శీర్షికలు ఇచ్చి ప్రచురించింది. దానికి భిన్నంగా తొలి రౌండ్‌ ఎన్నికల్లో అర్జెంటీనా ప్రజలు లెఫ్ట్‌ వైపు మొగ్గు చూపారు. యూనియన్‌ ఫర్‌ ది హౌమ్‌ల్యాండ్‌ కొయిలేషన్‌కి చెందిన ఆర్థిక మంత్రి మాస్సా 36.7 శాతం ఓట్లు రాగా, ఫ్రీడమ్‌ అడ్వాన్సెస్‌ అలయన్స్‌కి చెందిన మితవాద జేవియర్‌ మిలెరుకు 30 శాతం ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో ఏ అభ్యర్థికీి 50 శాతం ఓట్లు రానందున, మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య తుది పోరు నవంబరు 19న జరగనుంది. దేశంలో ద్రవ్యోల్బణం 140 శాతానికి పెరిగిపోయింది. పైగా దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగుమతులు తగ్గిపోయాయని, అందువల్ల దుర్భర పరిస్థితులే తనకు వారసత్వంగా వస్తాయని ఆయన చెప్పారు. అయితే ఆ అధ్వాన్న పరిస్థితులన్నీ కూడా ఇక గత కాలమే అవుతుందని, రాబోయేదంతా మంచి కాలమేనని ఆయన వారికి హామీ ఇచ్చారు. రెండో రౌండ్‌లో ఇతర పార్టీల మద్దతు కూడా కావాలని ఆయన కోరారు.