Aug 09,2023 12:54

బ్రసీలియా :   లాటిన్‌ అమెరికా దేశాల నేతలు, ప్రతినిధులు నాలుగవ అమెజాన్‌ సమ్మిట్‌లో పాల్గన్నాయి. ఈ సదస్సులో బ్రెజిల్‌, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్‌, బొలీవియా, గయానా, పెరూ మరియు సురినామ్‌ ప్రభుత్వాలు 113 అంశాలను అంగీకరించాయి. ఈ సమ్మిట్‌లో వారు ''ది అమెజాన్‌ కో-ఆపరేషన్‌ ట్రిటీ ఆర్గనైజేషన్‌ (ఎసిటిఒ)'' ఒప్పందంపై సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, పేదరికంపై పోరుపై దృష్టి సారించామని, ఈ ప్రాంతం కోసం ఉమ్మడి ఎజెండాను బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎసిటిఒ నాలుగవ అధ్యక్ష శిఖరాగ్ర సమావేశం ఆగస్ట్‌ 8,9 తేదీలలో బ్రెజీలియన్‌ నగరం బెలెమ్‌లో జరుగుతోంది. దక్షిణ అమెరికా నేతలు దీనిలో భాగస్వామ్యమవనున్నట్లు ప్రకటించారు.

పర్యావరణ సంరక్షణకు సంబంధించి, దేశాల ప్రతినిధులు ఈసమస్యను ఎదుర్కోవడానికి 2030 నాటికి ఉమ్మడి లక్ష్యంగా అడవుల నరికివేతను ఎదుర్కొనేందుకు అమెజాన్‌ అలయన్స్‌ ఏర్పాటు కోసం పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సహజవనరుల అక్రమ మైనింగ్‌ను కూడా నిర్మూలించేందుకు, భూ పరిరక్షణకు అవసరమైన విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు.

'డిక్లరేషన్‌ ఆఫ్‌ బెలెమ్‌' గా ప్రకటించిన ఈ ఉమ్మడి ఎజెండాలో భాగంగా స్థానిక ప్రజలు, కమ్యూనిటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు వెల్లడించారు. కార్బన్‌ డయాక్సైడ్‌, గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాల కారణంగా ఏర్పడే వాతావరణ మార్పుల ప్రభావాలను పరిష్కరించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వనరులను అందించడానికి 'అభివృద్ధి చెందిన దేశాలు' సహకరించాలని కోరాయి. ఈ చర్యలలో భాగంగా ఏడాదికి వంద బిలియన్‌ డాలర్లను సమీకరించనున్నట్లు తెలిపాయి. దీనికోసం వినూత్న పెట్టుబడుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సమ్మిట్‌కి బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా అధ్యక్షత వహించగా, బొలివియా, కొలంబియా, పెరూ దేశాల అధ్యక్షులు లూయిస్‌ ఆర్స్‌, గుస్తావో పెట్రో, దినా బలూర్టేలు పాల్గొన్నారు. గయానా ప్రధాని మార్క్‌ ఫిలిప్స్‌, వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్‌లతో పాటు ఈక్వెడార్‌, సురినామ్‌ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.