న్యూఢిల్లీ : భూ కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌లకు కూడా బెయిల్ జారీ చేసింది. ప్రత్యేక సిబిఐ జడ్జి గీతాంజలి గోయల్ బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
2004-2009 మధ్య లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారంటూ లాలూతో పాటు మరో 15 మందిపై గతేడాది మేలో సిబిఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఈ ఏడాది జులై 3న సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. రైల్వేలోని వివిధ జోన్‌లలో గ్రూప్ డి పోస్టుల్లో పలువురిని నియమించినట్లు పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరు 22న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది.