న్యూఢిల్లీ : క్రిమినల్ పరువునష్టం కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ కోర్టు గురువారం మినహాయింపు ఇచ్చింది. మే 10న జంతర్ మంతర్ వద్ద మహిళా రెజర్లపై మాజీ చీఫ్, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ వేధింపులను నిరసిస్తూ ఆందోళన చేసిన సమయంలో పునియా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువునష్టం కలిగించాడని రెజ్లింగ్ కోచ్ నరేష్ దహియా కోర్టును ఆశ్రయించారు. ప్రాక్టీస్ సెషన్, త్వరలో జరిగే ఆసియా క్రీడల కోసం పునియా కిర్గిజిస్థాన్ వెళ్లడంతో ఆయనకు మినహాయింపునిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ యశ్‌దీప్ చాహల్ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో ఈ నెల 6న కూడా ఒక రోజు వ్యక్తిగత హాజరు నుంచి పునియాకు మినహాయింపును కోర్టు ఇచ్చింది.