న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు శనివారం అనుమతించింది. సెప్టెంబర్ 15 నుండి 27 వరకు బ్రిటన్, ఫ్రాన్స్ వెళ్లవచ్చని ప్రత్యేక జడ్జి ఎం.కె.నాగ్‌పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎఫ్‌డిఆర్ లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా కోటి రూపాయల సెక్యూరిటీ డిపాజిట్‌ను సమర్పించాలని కోర్టు సూచించింది. అలాగే ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్‌ను దేశం విడిచి వెళ్లేముందు రికార్డులో ఉంచాలని, విదేశాల్లో బస చేయనున్న హోటల్స్, కాంటాక్ట్ నెంబర్లు సమర్పించాలని ఆదేశించింది. ఈ అంశాల్లో తదుపరి విచారణను ఈ ఆదేశాలు అడ్డుకోవని ప్రత్యేక జడ్జి పేర్కొన్నారు.
ఎయిర్‌సెల్ మాక్సిస్, ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణాలకు సంబంధించిన నాలుగు కేసుల్లో సిబిఐ, ఈడి విచారణ చేపడుతోంది. సెప్టెంబర్ 18 నుండి 25 వరకు ఫ్రాన్స్‌లో నిర్వహించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టెన్సిన్ టోర్నమెంట్‌కు హాజరుకావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని కార్తి చిదంబరం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే బ్రిటన్‌లో నివసిస్తున్న తన కుమార్తెను కలుసుకునేందుకు లండన్ వెళ్లాల్సి వుందని అభ్యర్థించారు. అలాగే ఆయన కంపెనీ టోటస్ టెన్నిస్ లిమిటెడ్ లండన్‌లో నిర్వహించే వ్యాపార కార్యకలాపాలతో పాటు సమావేశాలకు హాజరుకావాల్సివ ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.