Nov 19,2020 06:32

ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ, ఉద్యోగుల నష్టపరిహారం, మెటర్నిటీ బెనిఫిట్‌, బిల్డింగ్‌ కార్మికుల సంక్షేమం, అసంఘటిత కార్మికుల సంక్షేమం తదితర 9 చట్టాలను మోడీ ప్రభుత్వం 'సామాజిక భద్రత కోడ్‌'లో విలీనం చేసింది. సామాజిక భద్రత కోడ్‌లో కూడా ఇపిఎఫ్‌ అమలుకు కనీస కార్మికుల సంఖ్య 20, ఇఎస్‌ఐ కు 10, గ్రాట్యూటీకి 10, మెటర్నిటీ బెనిఫిట్‌కు 10 యథావిధంగా కొనసాగుతున్నాయి. ఆలోపు కార్మికులున్న పని ప్రదేశాలలో అవి అమలు కావు. కనీస సంఖ్యను ఎత్తివేయాలన్న కార్మిక సంఘాల డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా సామాజిక భద్రతను సార్వత్రికం (అందరికీ అమలు) చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.

ఇపిఎఫ్‌ సంస్థ, ఇఎస్‌ఐ కార్పొరేషన్‌, బిల్డింగ్‌ కార్మికుల సంక్షేమ బోర్డులు కార్మిక సంఘాల పోరాటాలతో యథాతథంగా కొనసాగుతాయి. కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెలు, ఆందోళనలు లేకుంటే అవి ఈపాటికే కాల గర్భంలో కలిసిపోయేవి. కాని ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ లను రాబోయే కాలంలో బలహీనపరిచే నిబంధనలను ప్రభుత్వం కోడ్‌లో చేర్చింది. ఇపిఎఫ్‌ కు చెల్లింపులను 12 నుండి 10 శాతానికి తగ్గించింది. ఈ 10 శాతాన్ని కూడా మరింతగా తగ్గించే అధికారాన్ని ప్రభుత్వం తీసుకుంది. ప్రావిడెంట్‌ ఫండ్‌, పెన్షన్‌, డిపాజిట్‌ లింక్‌డ్‌ ఇన్సూరెన్సు పథకాలలో పార్లమెంట్‌కు పోకుండా మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి వచ్చింది. ఇంతకు ముందు ఉన్న ఇపిఎఫ్‌ చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదం లేకుండా మార్చే అవకాశం లేదు.

యజమానులు, కార్మికుల ఆమోదంతో ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ ల నుండి బయటకు వెళ్ళే వెసులుబాటును సామాజిక భద్రత కోడ్‌ ఇచ్చింది. మోడీ ప్రభుత్వం 2014లో అధికారం లోకి వచ్చిన దగ్గర నుండీ ఇపిఎఫ్‌ నుండి కొత్త పెన్షన్‌ పథకం లోకి, ఇఎస్‌ఐ నుండి మెడికల్‌ ఇన్సూరెన్సు స్కీం లోకి మార్చే ప్రయత్నం చేసింది. వాటిని కార్మిక సంఘాలు తిప్పికొట్టగలిగాయి. కానీ ఆ ప్రయత్నాన్ని వదులుకోకుండా దానికి అవసరమైన ఏర్పాట్లను సామాజిక భద్రత కోడ్‌లో చేసింది. నోటిఫికేషన్ల ద్వారా కొత్త పెన్షన్‌ పథకం లోకి, మెడికల్‌ ఇన్సూరెన్సు స్కీం లోకి పంపే ప్రణాళిక కనపడుతోంది.

షేర్‌ మార్కెట్ల లోకి కార్మికుల పొదుపును తరలించేందుకు కొత్త పెన్షన్‌ స్కీం వచ్చింది. మెడికల్‌ ఇన్సూరెన్సు రంగం లోకి వచ్చే విదేశీ పెట్టుబడుల కోసం ఇఎస్‌ఐ ను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఇదే జరిగితే కార్మికులకు పెన్షన్‌ అనేది ఉండదు. అసలు పి.ఎఫ్‌ డబ్బులకే మోసం వస్తుంది. ఇఎస్‌ఐ లో వచ్చే సిక్‌నెస్‌ బెనిఫిట్‌, తాత్కాలిక అశక్తత బెనిఫిట్‌, శాశ్వత వికలాంగ బెనిఫిట్‌, నిరుద్యోగ భృతి ఉండవు. ఒక్క మందులు, ఆసుపత్రి సౌకర్యాలే ఉంటాయి.

అసంఘటిత కార్మికుల సంక్షేమ చట్టం 2008లో వచ్చినా దాని వలన అసంఘటిత కార్మికులకు ఒనగూరిన ప్రయోజనం లేదు. ఆ చట్టానికి సంబంధం లేకుండా అంతకు ముందు నుండి అమలవుతున్న కొన్ని పేదల సంక్షేమ పథకాలను అందులో చేర్చారు. వృద్ధాప్య పెన్షన్లు, ప్రసూతి ప్రయోజనాలు (తల్లీబిడ్డ పథకం), చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులతో పాటు మరికొన్ని పథకాలు కలిసిపోయి మన రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ బీమా, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ అమలయ్యేవి ఉన్నాయి. ప్రత్యేకంగా అసంఘటిత రంగ కార్మికులకు పథకాలు అందులో లేవు. ఆ చట్టంలో కూడా పి.ఎఫ్‌, పెన్షన్‌ ఇంకా అనేక పథకాల గురించి చెప్పినా వాటి గురించి ఆచరణ ఎక్కడా లేదు. నిధుల కేటాయింపు లేదు. 

సామాజిక భద్రత కోడ్‌లో సామాజిక భద్రత పరిధి లోకి జిగ్‌ వర్కర్లు (యజమాని-కార్మిక సంబంధం లేనివారు), ప్లాట్‌ఫాం వర్కర్లు (ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫాం వర్కర్లు-స్విగ్గీ లాంటి వారు), స్వయం ఉపాధి కార్మికులు, మిగతా అసంఘటిత కార్మికులందరినీ తీసుకొచ్చారు. ఇంత మందిని తెచ్చామని చెప్పుకోవటానికే పనికి వస్తుంది తప్ప ఆచరణలో ఉపయోగపడదు. దీనికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించకుండా ఈ పథకాలు అమలయ్యే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు గురించి కోడ్‌లో ఉన్నా అది అమలు కాదు. అరకొర కేటాయింపులు ఎందుకూ పనికిరావు. 2008లో వచ్చిన అసంఘటిత రంగ కార్మికుల చట్టానికి పట్టిన గతే దీనికీ పడుతుంది.
                                                            - పి.అజయ కుమార్‌ (సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు)