ప్రజాశక్తి - కాకినాడ రూరల్ 'వేతనాలు పెంపుదల, పిఎఫ్, ఇఎస్‌ఐ తదితర డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వాకలపూడిలో పంచాయతీ కార్మికులు చేపట్టిన ఆందోళన సోమవారం నాటికి 27వ రోజుకు చేరుకుంది.' ఈసందర్భంగా ధర్నా నిర్వహించారు. ఈనెల 6న డిఎల్‌పిఒ అమ్మాజీ, ఎంపిడిఒ నారాయణమూర్తి, ఇఒపిఆర్‌డి భాస్కరరావు, పంచాయతీ కార్యదర్శి డి.వెంకట రమణ సమక్షంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు కోరారు. ఈసందర్బంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడారు. ఈనెల 6న అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో సానుకూలత వచ్చినా పంచాయతీ కార్యదర్శి అమలుకు కృషి చేయకపోవడం సమంజసంగాలేదన్నారు. యూనియన్ నాయకురాలు మోకా కుమారి మాట్లాడారు. గ్రామంలో పారిశుధ్య పనులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి డి.వెంకటరమణను మరోసారి సంప్రదించగా, ఎంపిడిఒ నుంచి రాతపూర్వకంగా ఆర్డర్ వచ్చినట్లయితే జీతాలు పెంపుదల తీర్మానం పెడతానని చెప్పారు. మంగళవారం సాయంత్రంలోగా హామీ అమలుకు ప్రయత్నం జరగని పక్షంలో బుధవారం నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు మాతా గాంధీ, నాయకులు డి.అర్జున్, ఎం.రాజు, జి.సత్తిబాబు, డి.గోవింద్, పి.సూరిబాబు, వి.దానయ్య, ఎ.బాబూజీ, జి.రాజు, ఎం.వీరాంజనేయులు, పిజ్యోతి, నవీన్ పాల్గొన్నారు.










