Jun 30,2022 06:58

జిపిఎఫ్‌ ఖాతాల్లోని ఉద్యోగుల సొమ్మును వారి అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పిఎఫ్‌ ఖాతాలో ఒకసారి జమయిన మొత్తం సురక్షితంగా ఉంటుందని ఎవరైనా భావిస్తారు. దానికి విరుద్ధంగా ఖాతాలో పడిన మొత్తం పడినట్టుగానే మాయం కావడం ఎంత ఘోరం! ఆ పని ఇతరులు ఎవరైనా చేసిఉంటే నేరం అవుతుంది. ఐపిసి సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకు పంపే అవకాశం ఉంటుంది. కానీ, కంచే చేను మేసినట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిర్వాకానికి పాల్పడితే ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలి? ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాగే చేసి ఉద్యోగుల ఆగ్రహానికి గురైన చరిత్ర కళ్ల ముందే ఉంది. మళ్లీ అదే వక్ర విన్యాసానికి పాల్పడటమంటే అర్ధం ఏమిటి? ప్రాణం మీదకు వస్తేనో, మరేదైనా అత్యవసరమైన ఖర్చు ముంచుకొస్తేనో ఆ గండం దాటడానికి జిపిఎఫ్‌లో మొత్తాన్ని ఉద్యోగులు వాడుకుంటారు. ఆ అవసరం రాకపోతే ఉద్యోగ విరమణ అనంతర ఖర్చుల కోసం దాచుకుంటారు. అది వారి హక్కు! నిజానికి కార్మికులు, ఉద్యోగులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కన్నీళ్లను తుడవడం, ఆదుకోవడం ప్రభుత్వాల నైతిక బాధ్యత. ఆ పని చేయకపోగా వారి కష్టార్జితాన్ని కూడా వారికి అందుబాటులో లేకుండా చేయడం ఏం పద్ధతి?
          2018 జులై నుండి 2021 జూన్‌ వరకు ఉన్న డిఎ బకాయిలను జిపిఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏప్రిల్‌ నుండి 2022 జూన్‌ వరకు ఐదు విడతలుగా అలా జమచేసింది. ఇలా జమ చేసిన మొత్తాన్ని మార్చి నెలలో ఒకేసారి వెనక్కి తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఖాతాల నుండి ఇలా 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఉంటుందని అంచనా! మార్చిలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటే, జూన్‌ నెలాఖరుకుగాని సంబంధిత ఉద్యోగులకు కూడా ఆ విషయం తెలియకపోవడం ఎంత దుర్మార్గం! అది కూడా ఎజి కార్యాలయం జిపిఎఫ్‌ ఖాతాలకు సంబంధించిన వివరాల స్లిప్పులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి, ఉద్యోగులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాతనే తెలిసింది. ఈ కాలమంతా అత్యవసర ఖర్చుల కోసం పెట్టుకున్న వందలాది జిపిఎఫ్‌ దరఖాస్తులను కారణం కూడా చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు విషయం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా ప్రభుత్వ వర్గాలు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం, మళ్లించిన మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో తిరిగి ఎప్పుడు జమ చేస్తారో కూడా చెప్పకపోవడం దారుణం! దీంతో ఉద్యోగుల్లో సహజంగానే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన బిల్డింగ్‌ సెస్‌ను టిడిపి ప్రభుత్వ హయంలో 400 కోట్ల రూపాయలు, వైసిపి ప్రభుత్వ హయంలో 700 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం మళ్లించారు. రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు ఆ మొత్తం కోసం ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నా, ప్రభుత్వం స్పందించడం లేదు. కరోనా కష్టకాలంలో ఆ మొత్తం ఉండి ఉంటే ఎన్ని నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా ఉండేదో!
        బిల్డింగ్‌ సెస్‌, జిపిఎఫ్‌ మరేదన్నా నిధులున్నా వాటికి ప్రభుత్వం సంరక్షకుడే కానీ యజమాని కాదు. కళ్లముందు కనపడ్డ ప్రతి రూపాయినీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తాం. వీలైనప్పుడు తిరిగి ఇస్తాం అంటే కుదరదు. పైగా లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన నిధులపై ఏకపక్షంగా వ్యవహరించడం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. విభజన హామీల అమలుతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించడానికి నిరాకరిస్తున్న నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరివల్లే రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. వాటి సాధన కోసం మడమ తిప్పకుండా పోరాడాల్సిన ప్రభుత్వం అడుగడుగునా సాగిల పడుతున్నందువల్లే ప్రస్తుత దుస్థితి! ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక సంఘాలతో చర్చించి వివరణ ఇవ్వాలి. మళ్లించిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలి.