
- ఉద్యమాలను అణచే ప్రయత్నానికి అడ్డుకట్ట
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నిరసనలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెంబరు 1ని హైకోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వానికి మరో మొట్టికాయ పడింది. ఇప్పటికే అనేక అంశాల్లో ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను ఫ్రశ్నిస్తున్న కోర్టు ఏకంగా జిఓ నెంబరు ఒకటిని రద్దుచేసింది. దీనిపై సుప్రీం కోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో అప్పీలుకు వెళ్లినా ఉపయోగం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదంటే రాష్ట్ర పభుత్వం ఈ ఏడాది జవనరి రెండో తేదీన జిఓ నెంబరు 1 తీసుకొచ్చింది. బ్రిటీష్‌కాలం నాటి పోలీసు రూల్స్ అధారంగా దీన్ని తీసుకొచ్చింది. అప్పటి నుండి నిరసనలు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వకుండా పోలీసుశాఖ ద్వారా తీవ్ర ఒత్తిడి తీసకొచ్చింది. అదే సమయంలో అధికార పార్టీ నాయకులు రోడ్లపై వాహనాలు అడ్డంగా పెట్టి గంటల కొద్దీ ట్రాఫిక్‌ను నిలిపేసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పైగా వారి కార్యక్రమాలకు పోలీసు రక్షణ కల్పించింది. అలాగే ఇటీవల కాలంలో పెరిగిన ప్రజా నిరసనలపైనా ఉక్కుపాదం మొపింది. కార్యక్రమానికి పిలుపు ఇచ్చీ ఇవ్వకముందే నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. ఈ మూడు నెలలకాలంలో ఈ నిర్బంధం మరీ తీవ్రమైంది. సిఎం ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం నాయకత్వాన్ని నిర్బంధించడం పరిపాటిగా మారింది. ఫలానా కార్యక్రమం చేసుకుంటున్నాము అనుమతి ఇవ్వాలని కోరితే దానికీ ప్రభుత్వం సహకరించలేదు. జిఓ పేరుతో వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల కార్యక్రమాలను పూర్తిగా అణచివేశారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాల్లో సవరణలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిరంకుశ జిఓను తీసకొచ్చిందని అప్పట్లోనే కార్మిక సంఘాల నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వంలో స్పందనలేకపోగా జిఓ అమలును మరింత కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో జిఓపై పలు సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు తీర్పును నిజర్వు చేసింది. అయితే జిఓ అమలు వేగవంతం అవుతోందని, హైకోర్టు తీర్పు వెలువరించడం లేదని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ పిటీషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు దీనిపై హైకోర్టు వెంటనే తీర్పు ప్రకటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం జిఓ నెంబరు1ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
- నియంతృత్వం గెలవదు
జగన్ వంటి నాయకులు వస్తారని ఊహించే..రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు. అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు ప్రజాస్వామ్యం ముందు నిలబడవు. అంతిమంగా గెలిచేది అంబేద్కర్ రాజ్యాంగమే. జగన్ నియంతృత్వం కాదు.
- చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత
- ప్రభుత్వానికి చెంపపెట్టు
జిఓ నెంబరు 1ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. ప్రజల నిరసనలను లెక్కచేయని వైసిపి ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పోకడలు విడనాడాలి. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే చర్యలు చేపట్టాలి.
- వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
- ఇకనైనా నిర్బంధం మానండి
జివో 1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టు తీర్పు వైసిపి ప్రభుత్వానికి చెంపపెట్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను గౌరవించాలి. ప్రజా ఉద్యమాలపై పోలీసులను ప్రయోగించి, ఉక్కుపాదం మోపటం మానాలి.
- కె రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి