Nov 07,2023 10:10

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. వెంటనే రోడ్ల నిర్మాణం నిలిపేయాలని నగరపాలక సంస్థతోపాటు సిఆర్‌డిఎను హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా మంగళగిరి మండలం నిడమర్రులో తమకు కేటాయించిన ప్లాట్లలో అధికారులు రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరపున న్యాయవాది లకీëనారాయణ సోమవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే నిర్మాణ పనులను ఆపేయాలని అధికారులను ఆదేశించింది. రైతులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలని తెలిపింది.