Sep 02,2023 07:52

బెంగళూరు : లోక్‌సభ ఎంపీగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జెడిఎస్‌ నాయకుడు ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. వచ్చే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధిస్తున్నట్లు జస్టిస్‌ కె.నటరాజన్‌ ఏకసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హసన్‌ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్‌ వేసినప్పుడు అఫిడవిట్‌లో తన ఆస్తులను పూర్తిగా వెల్లడించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ధ్రువీకరించింది. హసన్‌ నియోజకవర్గ ఓటరు జి. దేవరాజెగౌడ, బిజెపి అభ్యర్థి ఎ.మంజు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. హసన్‌ నియోజకవర్గంలో ఓట్ల సంఖ్యలో రెండోస్థానంలో ఉన్న మంజు కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నందున ఆయన ఎన్నికైనట్లు ప్రకటించలేమని స్పష్టం చేసింది. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినందుకు ప్రజ్వల్‌ తండ్రి రేవణ్ణ, సోదరుడు సూరజ్‌పైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది.