అమరావతి: ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. 'వైసిపి పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై నేను, ఇతర ప్రతిపక్ష నేతలు గళమెత్తుతున్నాం. మా నోళ్లు మూయించాలనే కేసు పెట్టారు. మేం ప్రభుత్వ అక్రమాలపై గొంతెత్తుతున్న అంశాలను ముడిపెట్టి మాపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ప్రతీకారానికి పాల్పడుతోంది' అని పిటిషన్‌లో పేర్కొన్నారు.