Jul 23,2023 21:45

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్రంలోని కొల్లేరు, పులికాట్‌, కోరింగ, ఉప్పలపాడు, భావనపాడు, సోంపేటల్లో ఎంతో విలువైన బీల భూములను రాజకీయ నేతలు, ఆక్రమణదారుల నుంచి కాపాడాలని మాజీ విశ్రాంత ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. రాజ్యాంగంలో 48 (ఎ) ఆర్టికల్‌, జాతీయ పర్యావరణ పరిరక్షణ విధానం ప్రకారం బీల భూముల పరిరక్షణ చట్టానికి అనుగుణంగా ఆ భూములను కాపాడాలని కోరారు. ఇప్పటికే కొల్లేరు పరిమితి ఏటా తగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అటవీ విభాగ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో 35 శాతం బీలలు ఇప్పటికే ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ భూములపై ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ దాస్‌ గుప్తా కమిటీ రిపోర్టును అధికారులు అధ్యయనం చేయాల్సిన అవసరముందని తెలిపారు. పర్యావరణ వనరులకు, జీవ వైవిధ్యానికి నష్టం కలిగితే రాష్ట్ర ఆర్థిక సంపదకు నష్టం కలిగినట్టేనని పేర్కొన్నారు. సోంపేట బీల భూముల రక్షణకు చర్యలు చేపట్టాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ 2022 ఏప్రిల్‌ 13న ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతర కాలంలో ఆ భూములపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని, అయినప్పటికీ భూముల రక్షణకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్‌జిటి ఆదేశాలను అమలు చేయాలని కోరారు.