అమరావతి బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇఎస్‌ఐ ఆస్పత్రులకు కాలం చెల్లిన మందుల సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా ప్రతి డిస్పెన్సరీకి 50 నుంచి 100 మందుల బాక్సులు అందుతుండగా, వీటిలో కాలం చెల్లిన మందులు 30 శాతం, నవంబర్, డిసెంబరు వరకు మాత్రమే వ్యవధి ఉన్న మందులు 70 శాతం ఉన్నట్లు సమాచారం. నాణ్యత లేని మందులు సరఫరా అవుతున్న విషయాన్ని దిగువస్థాయి ఉద్యోగులు పై అధికారుల దృష్టికి తీసుకువెడితే ఎవరికైనా ఇవ్వగలిగితే ఇవ్వండి లేకపోతే రెండు నెలలు ఆగి కాల్చేయండి అని చెబుతున్నట్లు తెలిసింది. 'ఆస్పత్రుల్లో మందులు లేవని మాత్రం చెప్పకండి' అని హుకుం కూడా జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో అవినీతి వెలుగులోకి వచ్చిన తరువాత ఆస్పత్రులకు మందుల సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ఈ నెల 15న 'ఇఎస్‌ఐలో మందుల్లేవ్..!' శీర్షికతో ప్రజాశక్తి ప్రచురించింది. రాష్ట్రంలోని 20 లక్షల కార్మిక కుటుంబాలు ఎదుర్కుంటున్న సమస్యలను ఆ కథనంలో వివరించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం హడావిడిగా ముందుల సరఫరా చేస్తున్నప్పటికీ, కాలం చెల్లిన, నాణ్యత లేని మందులు అందుతుండటం పట్ల ఉద్యోగులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
అవసరం లేని మందులు సరఫరా
ఇఎస్‌ఐకు వెళ్లే రోగుల్లో ఎక్కువ శాతం మంది బిపి, షుగర్, కేన్సర్, గుండె సంబంధిత జబ్బులున్న వారుంటారు. ఒక కేన్సర్ రోగికి నెలకు 60 మాత్రలు ఇవ్వాలి. తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి రోగులకు నెలకు 5 రకాల మందులతో కలిపి మొత్తం 150 మాత్రలు, 21 ఇంజెక్షన్లు ఇవ్వాలి. రోగులకు అవసరమైన ఇటువంటి మందులు కావాలని ప్రతిపాదనలు పంపించినా అవి సరఫరా కాలేదు. చర్మ వ్యాధులకు సంబంధించిన మందులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలోకాలపరిమితి దాటినవే ఎక్కువ శాతం ఉండటంతో మందులు పంపిణీ చేయకుండా బయట కొనుక్కోవాలని చెబుతూ రికార్డుల్లో మాత్రం ఇచ్చినట్లు రాసుకుంటున్నారని సమాచారం.










