Feb 03,2021 22:27

ఇఎస్‌ఐ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి సంతోష్‌కుమార్‌

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో తలపెట్టిన 100పడకల ఇఎస్‌ఐ (కార్మిక బీమా సంస్థ) ఆసుపత్రి నిర్మాణంపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. విజయ నగరంలోని ఎయు క్యాంపస్‌కు ఎదురుగా ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఏడాది క్రితమే శంకుస్థాపన చేసిన విషయం విదితమే. అనంతరం నిర్మాణ పనులు చేపట్టలేదు. దీనిపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రూ.73.68కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ ఆస్పత్రిని 2023 నాటికి పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలతోపాటు ఇన్‌, ఔట్‌ పేషెంట్లకు సకల సదుపాయాలు కల్పించనున్నారు. ఇందులో ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌ రూం, డయాగ్నోస్టిక్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆయుష్‌ వైద్యసేవలు కూడా ఇక్కడే అందజేసే విధంగా ఆసుపత్రి భవన సముదాయాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ ఆసుపత్రి ఏర్పాటు జిల్లా వాసుల చిరకాల వాంఛ. బొబ్బిలి ఎంపీగా బొత్స ఝాన్సీలక్ష్మి ఉన్న కాలంలో ఎన్‌ఎసిఎస్‌ థియేటర్‌ వెనుక భాగంలో ఇదే ఇఎస్‌ఐ ఆసుపత్రికి స్థలాన్ని కేటాయించారు. అంతకు ముందు ప్రస్తుతం విజయనగరం డిస్పెన్షరీ సముదాయంలోనే నిర్మించాలని భావించారు. అయినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ఆసుపత్రి నిర్మాణం చేపడితే కార్మికులు, చిరుద్యోగులకు ఎంతో ఆరోగ్య ప్రదాయినిగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఇదే బిజెపి ప్రభుత్వం గత ఏడేళ్లగా అదుగో ఇదిగో అంటూనే నెట్టుకొస్తోందని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక డిస్పెన్షరీలో ప్రాథమిక వైద్యసేవలు మాత్రమే అందుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి 3గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండడం వల్ల అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రులే గత్యంతరంగా మారుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇఎస్‌ఐ సేవలు పొందాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంటే తప్ప కేంద్రం తనంతటతానుగా ఇసుపత్రి సముదాయం నిర్మించే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.