Oct 27,2023 12:19

ప్రజాశక్తి-భీమవరం : దళిత స్మశాన వాటిక, ఇళ్ళస్థలాలు, డ్రైనేజీ, రోడ్లు సమస్యలపై ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు బత్తుల విజయకుమార్, కె.క్రాంతి బాబు తెలిపారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా కమిటీ  ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన దళిత రక్షణ యాత్రలో దళిత పేటల్లో అనేక సమస్యలను గుర్తించామన్నారు. స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్ళు గడుస్తున్నా నేటికీ దళితులు అభివృద్ధికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులు బ్రతికినంత కాలం కులవివక్షను ఎదుర్కొంటున్నారన్నారు. చనిపోయిన తర్వాత ఖననం చేసే విషయంలో కూడా దళితుల పట్ల వివక్ష కొనసాగుతుందనడానికి నేటికీ స్మశాన వాటికలు లేకపోవడమే అన్నారు. జిల్లాలో అన్ని కులాలు వారికి సకాలంలో ఇచ్చే స్మశానాలు ఇచ్చే ప్రభుత్వాలు దళితులకు కేటాయించడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు సరైన  డ్రైనేజీ,సీసీ రోడ్లు, మంచి నీరు వంటి అనేక సమస్యలపై దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దళిత చర్మకారులకు కనీస గుర్తింపు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. డప్పు కళాకారులకు కనీస భద్రత లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వృత్తులు చేసుకొనే వారిని కనీసం మనుషులుగా కూడా చూడడం లేదని విమర్శించారు. తక్షణం జిల్లా అధికారులు దళితులకు స్మశాన వాటికలు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్లు తక్షణం పూర్తిచేయాలని వారు డిమాండ్ చేశారు. దళితుల స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన కెవిపిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు దళితులందరూ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.