Sep 18,2023 17:50

ప్రజాశక్తి-ఉండి: రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన దళిత రక్షణ యాత్రను విజయవంతం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు తెలిపారు. దళిత రక్షణ యాత్రలో భాగంగా సోమవారం మండలంలోని పాందువ్వ గ్రామంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళిత పేటలో సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు.  అనంతరం కెవిపిఎస్ మండల కార్యదర్శి మదాసి గోపీ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు మాట్లాడుతూ దేశంలో రెండవ సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  దళితుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులకు తూట్లు పొడుస్తోంది అన్నారు. రిజర్వేషన్లను ఎత్తేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తుందన్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. సనాతన ధర్మం పేరుతో కుల వ్యవస్థను ప్రోత్సహిస్తోందన్నారు. అలాంటి సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలని తెలిపారు. రాష్ట్రంలో ఆత్మగౌరవం, ఉపాధి, సంక్షేమం, దళితపేటల అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో దళిత రక్షణ యాత్రను చేపడుతున్నట్లు చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం దళిత పేటల అభివృద్ధికి ఉన్న సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్ల కాలంలో దళితులపై దాడులు, అత్యాచారాలు మరింతగా పెరిగాయన్నారు. 76 సంవత్సరాల స్వాతంత్య్రంలో నేటికీ  దళితులపై కంటికి కనపడని వివక్ష కొనసాగుతుందన్నారు.  ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరు కార్చే 41 సి ఆర్ పి సి ప్రకారం బెయిల్ ఇవ్వడం దారుణమన్నారు. దళితులు ఎదుర్కొనే సమస్యలను దళిత రక్షణ యాత్రలో అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా 20మండలాల్లో, 6 మున్సిపల్ పట్టణాల్లో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్రను జయప్రదం చేయాలని అభ్యుదయ వాదులను, మేధావులను, సోదర దళిత, ప్రజా సంఘాలను, వివిధ సంస్థలను, ఎస్సీ,ఎస్టీ, బీసీ సంఘాలుకు ఆయన విజ్ఞప్తి చేశారు.
     ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ గ్రామ సభ్యులు మేడపాటి ప్రసాద్, బద్ది రమేష్, దేవబత్తుల శ్రీను, ఎస్.రాజేష్, ఎం నరేష్, గొల్లపల్లి యేసు, బి రాంబాబు, ఎం లవ కుమార్, జి సురేష్, ఎం.మహేంద్ర గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.